సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : షాడో నేతల వ్యవహారంపై హెచ్ఎండీఏలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పైరవీలపై కింది స్థాయి సిబ్బంది, క్షేత్రస్థాయి అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పనులు జరగకుండా క్షేత్రస్థాయి సిబ్బందిని నియంత్రించడంపై హెచ్ఎండీఏ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంఏయూడీలో కీలక బాధ్యతలు తీసుకున్న ఉన్నతాధికారి, ఇటీవల హెచ్ఎండీఏకు వచ్చిన మరో అధికారి వ్యవహారమే క్షేత్రస్థాయి సిబ్బందిని మరింత కలవరపెడుతోందని ఆవేదన చెందుతున్నారు.
హెచ్ఎండీఏలోని కొందరు డైరెక్టర్లు, ఇంజినీరింగ్ ముఖ్య అధికారుల సాయంతో సదరు ఎంఏయూడీ అధికారి ఆడింది ఆటగా మారిందనే ఆరోపణలు ఉండగా, దానికి హెచ్ఎండీఏ ఉన్నతాధికారి కూడా వంత పాడుతున్నారని సమాచారం. ఇటీవల డెవలప్మెంట్ పనుల వ్యవహారంలో కూడా షాడో నేత కలుగజేసుకుని, ఎంఏయూడీ ఉన్నతాధికారి సాయంతో ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిసింది. కొన్ని నిబంధనలను షాడో నేతల అనుమాయులకు అనుకూలంగా ఉండటంతో టెండర్ దక్కించుకోవడానికి సాయపడినట్లు హెచ్ఎండీఏలో చర్చ నడుస్తోంది. మొదటి నుంచి ఇంజినీరింగ్ విభాగంలో ఉండే ఓ ఉన్నతాధికారి వ్యవహారం కూడా షాడో నేతలు చెబితే పనిచేస్తున్నారని, అందుకు అనుగుణంగా ప్రమోషన్ దక్కిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు ట్యాంక్ బండ్పై కోట్లు విలువ చేసే పార్కింగ్ దందాలోనూ సదరు ఉన్నతాధికారి పాత్ర ఉందని తెలిసింది. తాజాగా ప్లానింగ్ విభాగంలో కీలకమైన ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ విషయంలోనూ ఈ ఇద్దరూ అధికారుల చేతుల్లో వ్యవహారం జరిగినట్లు సమాచారం.
తోలుబొమ్మలుగా ఉన్నతాధికారులు..
హెచ్ఎండీఏకు ఆదాయాన్ని సమకూర్చే వాటిలో ప్రధానమైనది ప్లానింగ్ విభాగం. ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ కేంద్రీకృతమై, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తుందంటేనే దానికి ప్లానింగ్ విభాగమే కారణం. దీంతో హెచ్ఎండీఏను గుప్పిట్లో పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఇద్దరు ఉన్నతాధికారులకు హెచ్ఎండీఏను ప్రభుత్వం కట్టబెట్టింది. వీరినే తోలుబొమ్మలుగా చేసుకుని తమకు కావాల్సిన వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారని, అందులో భాగంగానే తాజాగా ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. అయితే పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు క్లియరెన్స్ ఇస్తే హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరినా.. తమ ఖాతాల్లోకి వచ్చే అవకాశం లేకపోవడంతోనే ఫైళ్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారని, బేరం కుదిరితే మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయంటూ హెచ్ఎండీఏ అధికారులు చర్చించుకుంటున్నారు.