సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కాసులు కురిపించిన కోకాపేట్ భూములపై ఇప్పుడు హెచ్ఎండీఏ గంపెడాశలు పెట్టుకున్నది. కాంగ్రెస్ సర్కార్‌కు నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల సర్దుబాటులో ఈ వెంచర్ కీలకంగా మారింది. దీంతోపాటు హెచ్ఎండీఏ ప్రతిపాదిత ప్రాజెక్టులకు భారీ మొత్తంలో నిధులు వెచ్చించాల్సి ఉండగా.. కోకాపేట్‌లోని నియోపోలిస్, గోల్డెన్ మైల్ లే అవుట్ ప్రాజెక్టుల్లోని ఏడు ప్లాట్ల ద్వారా వచ్చే రెవెన్యూ అభివృద్ధి పనుల్లో పురోగతికి ముఖ్య భూమికను పోషించనుంది. దీంతో ఈనెల నవంబర్ 24, 25 తేదీల్లో ఆన్లైన్ వేదికగా వేలానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోపోలిస్‌లోని ప్లాట్లకు ఎకరానికి రూ.99కోట్లు ధర నిర్ణయించగా, గోల్డెన్ మైల్ ప్రాజెక్టులో ఎకరానికి రూ.70 కోట్లుగా నిర్ధారించారు.
నిరుత్సాహపరిచిన ప్రీ బిడ్డింగ్!
దాదాపు 5 వేల కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంగా కోకాపేట్ భూములను వేలానికి సిద్ధం చేసిన హెచ్ఎండీఏకు షాక్ తగిలింది. భారీ ఆశలతో లే అవుట్‌లోని ప్లాట్లను విక్రయించనుండగా, అప్ సెట్ ధరతో కొనుగోలుదారుల ఆశలు నీరుగారేలా ఉన్నాయి. ప్రస్తుతం ఎకరం ధరను రూ.99కోట్లుగా నిర్ధారించింది. ఇందులో భూములు కొనేందుకు ఆసక్తి ఉన్నవారితో ఇటీవల ప్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహించగా.. ఆశించినంత స్పందన రాలేదని అధికారుల్లో చర్చ నడుస్తున్నది. అసలు వాస్తవ డిమాండ్ కంటే.. వేలం ధర ఎక్కువగా ఉందనే భావనలో కొనుగోలుదారులు ఉండటం చర్చనీయాంశంగా మారింది.
రెండున్నర రెట్లు పెరిగిన అప్సెట్ ధర..
మూడేళ్ల కిందట బీఆర్ఎస్ హయాంలో కోకాపేట్ భూములకు తొలిసారి వేలం నిర్వహించారు. అప్సెట్ ధర రూ.35-39 కోట్లుగా నిర్ధారించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ అధిక రెవెన్యూ లక్ష్యంగా అప్సెట్ ధరను రెండున్నర రెట్లకు పెంచింది. దీంతో ఎకరం రూ.99కోట్లకు చేరగా… అక్కడి నుంచి ఎవరు ఎక్కువ ధరకు పాట పాడితే వారికి ప్లాట్లు దక్కనున్నాయి. అయితే భారీ డిమాండ్ ఉంటే గనుక భూముల వేలం ద్వారా ఎకరం రూ.25-30 కోట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే ప్రస్తుతం నిర్ధారించిన అప్సెట్ ధర మార్కెట్ ధరకు సమానంగా ఉండటమే కొనుగోలుదారులను కలవరపెడుతున్నది. ఒకేసారి రూ.100 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. నిర్మాణ అనుమతుల్లో మినహాయింపులు తప్పా… ధర పరంగా గిట్టుబాటు కాదనే అభిప్రాయాన్ని కొందరు బిల్డర్లు వ్యక్తం చేశారు. ఈ లెక్కన అప్సెట్ ధరను నిర్ణయించడం వల్ల వేలానికి వచ్చే వారి సంఖ్య పరిమితం అవుతుందని చెబుతున్నారు. అదే గనుక జరిగితే కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సారథ్యంలో నిర్వహించిన రెండో దఫా భూముల వేలం కూడా గిరాకీ లేకుండా పోయే అవకాశం ఉంటుంది.