రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, నవంబర్ 30 : కొత్త ఓటరు నమోదుతోపాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి గడువు ముగిసింది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 30 వరకు కొత్తగా ఓటరు నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. ప్రతి ఏటా ఓటరు జాబితా ముసాయిదా విడుదల అనంతరం ఓటరు నమోదుకు, మరణించిన లేదా శాశ్వతంగా నివాసం మార్చిన వ్యక్తి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించుటకు, ఓటరు జాబితాలో పేరు సవరించుకునేందుకు, ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో నివాసం మార్చుకున్నా, నివాసాన్ని కొత్త నియోజకవర్గంలోకి మార్చుకున్నట్లయితే సవరణలకుగాను నమోదుకు ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. రంగారెడ్డిత జిల్లాలో గత 50 రోజుల్లో కొత్త ఓటరు నమోదుతోపాటు మార్పులు, చేర్పులకుగాను 19,059 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 3914, రాజేంద్రనగర్‌లో 3413, ఎల్బీనగర్లో 3047, మహేశ్వరంలో 2889, ఇబ్రహీంపట్నంలో 2082, షాద్‌నగర్‌లో 1871, కల్వకుర్తిలో 1134, చేవెళ్ల నియోజకవర్గంలో 711 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత దరఖాస్తుల్లో అత్యధికంగా 12 వేల దరఖాస్తులు కొత్త ఓటరు నమోదుకుగాను దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. కొత్త ఓటరు నమోదుతోపాటు మార్పులు, చేర్పుల నిమిత్తం వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు 2029 దరఖాస్తులకు ఆమోదం తెలుపగా, మరో 2173 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మరోవైపు ఈ నెల 20 వరకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను చేపట్టి, జనవరి 5 ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు.
ప్రత్యేక ప్రచార రోజుల్లో స్వీకరించిన దరఖాస్తులు 18237
ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్ నవంబర్‌లో నాలుగు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో 18237 దరఖాస్తులొచ్చాయి. పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో 6,672 దరఖాస్తులు, వికారాబాద్‌లో 5,067 దరఖాస్తులు, తాండూరులో 3,129 దరఖాస్తులు, కొడంగల్‌లో 3,369 దరఖాస్తులు వచ్చాయి. నవంబర్ 30వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. నవంబర్ 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని 1130 పోలింగ్ బూత్‌లలో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఈ నాలుగు రోజుల్లోనే కొత్తగా ఓటరుగా నమోదు కోసం 2793, ఓటర్ల జాబితాలో నుంచి పేర్లు తొలగింపునకు 4858, సవరణలకు 394, చిరునామా మార్పునకు సంబంధించి 45 దరఖాస్తులందాయి.
ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలు
నియోజకవర్గం ఫారం-6 ఫారం-7 ఫారం-8 ఫారం-8ఎ
పరిగి 829 2406 108 15
వికారాబాద్ 600 2228 88 5
తాండూరు 727 10 103 11
కొడంగల్ 637 214 95 14