రంగారెడ్డి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రతి శుభకార్యం, ప్రతి ఫంక్షన్లో జరబర పూలదే అలంకరణ అంతా. పూలన్నింటిలో వేదికను అలంకరించేది ఒక్క జరబర పూలు మాత్రమే. ఆ పూల సాగుకు కేంద్రమైంది.. రంగారెడ్డి జిల్లాలోని ‘చన్వెల్లి’ గ్రామం. రంగారెడ్డి జిల్లా వాణిజ్య వ్యాపారానికే కాకుండా కూరగాయలు, పండ్ల తోటలకు పెట్టింది పేరు. వీటితో పాటే పూల సాగుకు సైతం ఈ జిల్లా పేరొందుతున్నది. ఈ జిల్లాలో వానకాలం, యాసంగి కాలాల్లో మొత్తం కలుపుకొని 6,500 ఎకరాలకు పైగా పూలసాగు జరుగుతున్నది. కాగా, ఏడాదికి 45 వేల మెట్రిక్ టన్నులకు పైగా పూల దిగుబడి వస్తున్నది. గత ప్రభుత్వాల పాలనలో పలు పంటలకు సబ్సిడీ రాక, పాలకులు ఇవ్వక రైతులు అందీ అందని సహకారంతో సతమతమవుతూ విభిన్నమైన పంటల జోలికి వెళ్లకుండా సంప్రదాయ పంటల సాగుతోనే సరిపెట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక, రైతు రాజ్యం వచ్చింది. రైతులకు విభిన్నమైన పంటలను సాగు చేసుకునేందుకు స్వేచ్ఛ, సహకారం అందివచ్చింది. ప్రభుత్వం సరికొత్త ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పంటల సాగుకు ఆర్థికంగా, తెలంగాణ ప్రభుత్వం సాయం అందిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో రైతుల ఆశలకు రెక్కలొచ్చి పలు వాణిజ్య పంటల సాగుకు బీజం పడింది. అందులోనిదే.. ఈ ‘జరబర’ పూల సాగు.
చేవెళ్ల మండలంలో సాగు ఎక్కువ..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం, చన్వెల్లి గ్రామంలో జరబర పూల సాగు ఎక్కువగా జరుగుతున్నది. గతంలో కొంచెం ఆర్థికంగా బలపడిన వారు మాత్రమే స్థానికంగా ఈ పూల సాగును చేసేందుకు సాహసించారు. ఈ సాగు ఖర్చుతో కూడుకొని ఉండటం ఒక కారణం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం, ప్రభుత్వ పరంగా 75శాతం సబ్సిడీని ఇవ్వడంతో రైతుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నది. ఈ నేపథ్యంలో ఈ పూల సాగుకు రైతులు ముందుకొచ్చారు. ఒక్క చన్వెల్లి (ఇక్కారెడ్డి గూడ)లోనే దాదాపు 55 మందికి పైగా రైతులు 45 ఎకరాల్లో ఈ పూల సాగు చేస్తున్నారు. ఈ సాగుపై రైతు కుటుంబాలే కాకుండా 300 నుంచి 400 వరకు ఎన్నో వలస కుటుంబాలు సైతం రోజు వారి కూలీలుగా ఉపాధి పొందుతున్నారు. ఈ పూల సాగుకు కాస్త భద్రత, పరిశీలన ఎక్కువగా ఉండాలని రైతులు చెబుతున్నారు. ఈ పూల సాగు కనకమామిడి (మొయినాబాద్), ఇబ్రహీంపల్లి, చేవెళ్లలో కూడా కొనసాగుతున్నది.
60 పాలీ హౌసుల్లో సాగు
చన్వెల్లి (ఆమ్లెట్- ఇక్కారెడ్డి గూడ)లో పెద్ద మొత్తంలో ఈ పూల సాగు జరుగుతున్నది. 45 ఎకరాల్లో దాదాపు 50 నుంచి 60 పాలీ హౌసుల్లో ఈ సాగు కొనసాగుతున్నది. దీని సాగుకు టెంట్, పాలీ హౌస్, స్ప్రింక్లింగ్, పెస్టిసైడ్స్, మొక్కల కొనుగోలు తదితర వ్యవహారాలకు గాను ఒక అర ఎకరానికి రూ.25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతున్నది. జరబర మొక్కలను పొరుగు రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఒక్కో మొక్కకు రూ.35 అవుతున్నది. మొక్కలను ఎర్రమట్టిలోనే సాగు చేస్తే అవి ఏపుగా పెరిగే అవకాశం ఉంది. ఆ మట్టి లేని వారు దానిని సైతం దిగుమతి చేసుకుంటున్నారు. 50 రోజుల్లో మొక్క ఎదిగి పూతకు వస్తుంది. ఎదిగిన మొక్కలు ఆరేండ్ల పాటు పూలు పూస్తూనే ఉంటుంది. పది రోజుల్లో పూలు రెండుసార్లు కోతకు వస్తాయి.
లాభదాయకంగా..
ప్రతి నాలుగు రోజులకు ఒకసారి పూలు కోతకు వస్తాయి. కోసిన పువ్వులను పది చొప్పున ఒక కట్టగా కడతారు. అలా నలభై కట్టలను ఒక బాక్స్‌గా అమర్చుతారు. అలా అమర్చిన బాక్స్ సీజన్‌ను బట్టి అమ్మకం అవుతుంది. సాధారణంగా ఒక పూల కట్టకు రూ.100 అవుతున్నది. ఇంకా బాక్స్‌లు అయితే, రూ.1000 నుంచి రూ.4000 వరకు అమ్ముడవుతున్నది. కాలంతో సంబంధం లేకుండా ఈ పూల సాగు జరుగుతున్నది. ఇలా ఒక నెలలో ఎనిమిది దఫాలుగా ఈ పూల కోతను చేపట్టే అవకాశం ఉంది. ప్రతి అర ఎకరాకు 13 నుంచి 15 బాక్స్‌ల వరకు దిగుబడి వస్తున్నది. పూలు హైదరాబాద్ మార్కెట్‌కు, పొరుగు రాష్ర్టాలకు ప్రధానంగా ఢిల్లీ, ముంబై లాంటి ప్రధాన నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. చాలా వరకు రైతులు పావు ఎకరా నుంచి అర ఎకరం, ఎకరం, ఎకరన్నరలో పూల సాగును చేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
మూడు ఎకరాల్లో ఈ పూల సాగుకు ప్రణాళిక చేసుకున్నా. తోటి రైతులను ఆసరాగా తీసుకొని ఎంతో మంది ఈ సాగుకు ముందడుగు వేస్తున్నారు. సంప్రదాయ పంటలైన వరి, వేరు శనగ కంటే ఈ పూల సాగు ఎంతో లాభదాయకంగా తోచింది. నా మిత్రులు నన్నెంతగానో ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ, ప్రోత్సాహకాలు ఉత్సాహాన్ని నింపాయి. సీఎం కేసీఆర్‌కు ప్రతి రైతు రుణపడి ఉంటాడు.
– కె.కరాజి, రైతు, చన్వెల్లి
మారిన రైతుల స్థితిగతులు
ప్రస్తుతం, ఒక ఎకరం సాగుకు అడుగులు వేస్తున్నం. అయితే, పాతవి మూడెకరాల్లో సాగు కొనసాగుతున్నది. దిగుబడి ప్రతి నాలుగు రోజులకు అందరికీ ఒకేలా వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతుల స్థితిగతులు మారిపోయాయి. దేశంలో ఎక్కడా అందని విధంగా సహాయ, సహకారాలు తెలంగాణ రైతులకు అందుతున్నాయి.
– కావలి యాదయ్య, రైతు, చన్వెల్లి
తెలంగాణ వచ్చాకే.. సాగు చేస్తున్నాం
జరబర పూల సాగు ఎనిమిదేండ్లుగా చేస్తున్నాను. గత ప్రభుత్వాల హయాంలో డబ్బున్న వాళ్లు మాత్రమే ఈ పూల సాగు చేసేవారు. కానీ, సాధారణ రైతు కుటుంబాలేవీ ఈ సాగు చేసేవారు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాతే, సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను గుర్తించి ఈ పూల సాగులో 75శాతం సబ్సిడీ ఇచ్చారు. ఈ పూల సాగులో సత్ఫలితాలు అందుతున్నాయి.
– జె.శివానందం, రైతు, చన్వెల్లి