సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాజీవ్ రహదారి వెంబడి ఆస్తుల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ నిర్మాణ పనులకు బ్రేక్ పడినట్లు అయ్యింది. ప్రాజెక్టు భూ సేకరణ విషయంలో బాధితుల అభిప్రాయాలకు ప్రాధాన్యత లేదని, పరిహారం, రహదారి వెడల్పు విషయంలో తమకు న్యాయం చేయాలంటూ ఇటీవల ఎలివేటెడ్ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై స్పందించిన రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం 6 వారాల వరకు ఎలివేటెడ్ పనులను వాయిదా వేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న యథాతథ స్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. కాగ, 200 ఫీట్ల వెడల్పుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వలన వందలాది ఆస్తులు ప్రభావితం అవుతున్నాయని బాధితులు కోర్టును ఆశ్రయించారు.
అయితే హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఊరట దొరికిందని, తమ న్యాయబద్ధమైన వాదనలను ఉన్నత న్యాయస్థానం గుర్తించిందని రాజీవ్ రహదారి భూ యజమానుల జేఎసీ చైర్మన్ సతీష్ గుప్తా వివరించారు. ప్రాజెక్టును తాము వ్యతిరేకించడం లేదని.. గడిచిన 9 నెలలుగా పలు డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు.
కానీ ప్రభుత్వం తమకు ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదని అన్నారు. అదేవిధంగా పారదర్శక విధానంలో పరిహారం కూడా లేదని, 100 ఫీట్లకు రోడ్డు వెడల్పు తగ్గిస్తే గానీ ప్రాజెక్టుకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోందని, ఇప్పటికే తమ ప్రాంతంలో రెంటల్ అగ్రిమెంట్లు తగ్గిపోయాయని, గడిచిన 9 నెలలుగా లక్షలాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయామని బాధితులు వాపోతున్నారు.