యాచారం, మే 18 : మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చిరు జల్లులతో మొదలైన వాన కుండపోతగా మారింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కొత్తపల్లి, మాల్, యాచారం, మేడపల్లి తదితర గ్రామాల్లో ఇండ్లల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. మండలంలోని మేడిపల్లి, కుర్మిద్ద, తాటిపర్తి, నజ్దిక్‌సింగారం, నందివనపర్తి, నానక్‌నగర్, మల్కీజ్‌గూడ, తాటిపర్తి, యాచారం, మాల్ తదితర గ్రామాల్లో సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది.
దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లో విద్యుత్ లేక అంధకారం ఏర్పడింది. కారు చీకట్లతో మబ్బులు కమ్ముకుపోవడం, రోడ్లపై నీరు నిలువడంతో ప్రయాణికులు, వాహనదారులు నానా ఇక్కట్లు పడ్డారు. యాచారం, మాల్, గున్గల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. మొత్తంగా భారీ వర్షం కురవడంతో వానకాలం పంటలను సాగుచేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. జోరుగా జొన్న, పత్తి, కంది తదితర పంటల విత్తనాలు వేయడం ఖాయంగా కనిపిస్తుంది.
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని గ్రామాల్లో శనివారం మోస్తరు వర్షం కురిసింది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అంతారం, ఆలూర్ గ్రామాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయి. దీంతో రోడ్లపై నీరు నిలవడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
మన్సూరాబాద్ : భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చింతలకుంట నుంచి పనామా చౌరస్తాకు వెళ్లే మార్గంలోని కేఎల్ఎం షోరూం వద్ద రోడ్డుపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీతో వరద నీటిని దారి మళ్లించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు.
అదేవిధంగా మన్సూరాబాద్ లోతట్టు కాలనీలు గణేశ్‌నగర్, శ్రీసాయినాథ్కాలనీ, మల్లికార్జుననగర్ నార్త్, ఆగమయ్యకాలనీ, హకీమాబాద్, కామినేని చౌరస్తా నుంచి మన్సూరాబాద్ చౌరస్తాకు వెళ్లే మార్గం, సెంట్రల్బ్యాంకు కాలనీ, నాగోల్ డివిజన్ పరిధి ఆనంద్‌నగర్ చౌరస్తా, శ్రీనివాసకాలనీ, విజయగార్డెన్, బండ్లగూడ, అయ్యప్పకాలనీ, త్యాగరాయనగర్ కాలనీల్లోని రోడ్లపైకి వరదనీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.