వికారాబాద్, ఆగస్టు 20 : వికారాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు వరద నీటితో ఉధృతంగా పారాయి. మండల పరిధిలోని మైలార్దేవరంపల్లిలోని కోళ్లోళ్ల వాగు, మద్గుల్‌చిట్టంపల్లి వాగు, రాళ్లచిట్టంపల్లి వాగు, ఆలంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా పారింది. ఆలంపల్లి రైల్వే బ్రిడ్జి నుంచి గెరిగెట్పల్లి వెళ్లే రోడ్డుపై నీరు ఉధృతంగా పారడంతో రాత్రి పోలీసులు బారికేడ్లు పెట్టి రాకపోకలను నిలిపివేశారు. మైలార్‌దేవరంపల్లి గ్రామంలోని కోళ్లోళ్ల వాగు వరద నీటితో ప్రవహించడంతో వాగు పక్కల ఉన్న పంట పొలాలు నీటమునిగాయి. దీంతో దాదాపు 200 ఎకరాల వరకు పత్తి, కంది, పసుపు, కూరగాయలు తదితర పంటలు ధ్వంసమయ్యాయి. పంట సాగు కోసం వేసిన డ్రిప్పులు కొట్టుకుపోయాయి. పంటలు నష్టపోయినవారందరికీ ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయాధికారులు వచ్చి ధ్వంసమైన పంటలను పరిశీలించలేదని ఆయా గ్రామాల రైతులు మండిపడుతున్నారు.
జిల్లాలో వర్షపాతం..
వికారాబాద్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకు మర్పల్లిలో 112.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మోమిన్‌పేట 133.9, నవాబుపేట 124.6, వికారాబాద్ 145.4, పూడూరు 128.5, పరిగి 135.2, కులకచర్ల 116.7, దోమ 111.9, బొంరాస్‌పేట 78.1, ధారూరు 125, కోట్‌పల్లి 119.5, బంట్వారం 123.2, పెద్దేముల్ 121.1, తాండూరు 132, బషీరాబాద్ 99.6, యాలాల 118.3, కొడంగల్ 101.1, దౌల్తాబాద్ 92.8, చౌడాపూర్ 52.9, దుద్యాల 89.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా వికారాబాద్ మండలంలో 145.4 మిల్లీమీటర్ల వర్షం పడగా, అత్యల్పంగా చౌడాపూర్ మండలంలో 52.9 మిల్లీ మీటర్ల వర్ష్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ధారూరు మండల పరిధిలో..
ధారూరు : మండల పరిధిలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దోర్నాల్-ధారూరు స్టేషన్ (కాగ్నా)వాగు పొంగిపొర్లడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన దెబ్బతిన్నది. దీంతో దోర్నాల్, అంపల్లి, గురుదోట్ల, నాగారం, కుమ్మరిపల్లి, దోర్నాల్ తండా తదితర గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కురిసిన వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి.
శంకర్పల్లి మండల పరిధిలో..
చేవెళ్ల రూరల్ : శంకర్పల్లి మండల పరిధిలోని టంగటూరు, ప్రొద్దుటూరు, మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా టంగటూరు, ప్రొద్దుటూరు, ఫతేపూర్ వాగులోకి వరద నీరు భారీగా చేరుతున్నది. వాగుల వద్ద ప్రమాదాలు జరుగకుండా గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతింటుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంటంతా నీటిలో కొట్టుకుపోయింది..
వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. మాకున్న రెండెకరాల్లో పత్తి, కంది, పసుపు సాగు చేసినం. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోళ్లోళ్ల వాగు ఉధృతంగా పారింది. దీంతో వాగు పక్కనే ఉన్న మా పొలాల్లో పంటంతా కొట్టుకుపోయింది. పొలాల్లో వర్షపు నీరు నిలిచి పంటలు పాడయ్యాయి. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం అందించాలి.
– ప్రవీణ్‌రెడ్డి, మైలార్‌దేవరంపల్లి, వికారాబాద్