ఆమనగల్లు,( మాడ్గుల) జూలై 11 : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. శుక్రవారం మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు మాడ్గుల మండల కేంద్రంలో కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా రూ.12.70 కోట్లతో నిర్మించ తలపెట్టిన 30 పడకల ప్రభుత్వ దవాఖానకు శంకుస్థాపన చేశారు.
అనంతరం కోనాపూర్ గ్రామం నుంచి మాడ్గుల మండల కేంద్రం వరకు , మాడ్గుల మండల కేంద్రం నుంచి దేవరకొండ రోడ్డు వర కు రూ.70 కోట్లతో నిర్మించే (డబుల్ రోడ్డు) బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. తదనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు.
సన్న వడ్లకు రూ. 500 బోనస్, ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, డీఎం హెచ్‌వో వెంకటేశ్వరరావు, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, ఆర్అండ్బీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.