మొయినాబాద్, డిసెంబర్ 21 : ప్రభుత్వ వైఫల్యంతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి శిక్షించక పోవడంతోనే దాడులు పునరావృతం అవుతున్నాయన్నారు. మండలంలోని తోలుకట్టా గ్రామ గేట్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలోని విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ శనివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు.
అనంతరం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాష్ట్ర నాయకులు అంజన్‌కుమార్‌గౌడ్, ప్రభాకర్‌రెడ్డి, ప్రకాశ్, గోపాల్‌రెడ్డి, గణేశ్, గ్రామస్తులు, అధిక సంఖ్యలో తరలివచ్చిన హిందువులతో కలిసి ఆయన బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రోడ్డుపై కిలోమీటర్ వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుం డా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
తహసీల్దార్ గౌతమ్‌కుమార్ సంఘటనాస్థలానికి చేరుకుని ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించి పంచనామా చేసి పోలీసులకు అందించగా వారు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. నిందితులను త్వరగా గుర్తించాలని రెవెన్యూ, పోలీసు అధికారులను కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే రాష్ట్ర డీజీపీ, కలెక్టర్‌తో మాట్లాడుతానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రవీందర్, అధిక సంఖ్యలో హిందువులు, స్థానికులు పాల్గొన్నారు.