రంగారెడ్డి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మొదటి రోజు నిర్వహించిన పరీక్షలకు 60 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలో జరిగిన పరీక్షకు 61 శాతం మంది అభ్యర్థులు హాజరుకాగా.. వికారాబాద్ జిల్లాలో…..59.42 శాతం మంది పరీక్ష రాశారు. అధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కేంద్రాల్లో సోమవారం పరీక్ష ముగియగానే అభ్యర్థుల పరీక్ష పత్రాలను బందోబస్తు మధ్య నగరానికి తరలించారు. పరీక్షలను రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి నేతృత్వంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఇతర జిల్లా అధికారులు, పోలీసు అధికారులు పర్యవేక్షించారు. అదేవిధంగా వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ కూడా పలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఆయన వెంట ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి, మోడల్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.