రంగారెడ్డి, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు జనరల్ ఇంగ్లిష్ పేపర్‌ను నిర్వహించారు. జిల్లాలో మొత్తం 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 8,011 మంది అభ్యర్థులకుగాను 5,854 మంది పరీక్ష రాయగా.. 2,157 మంది గైర్హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కళాశాలలో పరీక్ష రాసేందుకు రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. మొయినాబాద్‌లోని కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలోని పరీక్షా కేంద్రానికి ఓ అభ్యర్థి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. ప్రతి కేంద్రం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పటిష్ట నిఘాను ఉంచారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి కల్పించారు. ఈనెల 27 వరకు వివిధ సబ్జెక్టుల ప్రకారం పరీక్షలు జరుగనున్నాయి.
పర్యవేక్షించిన కలెక్టర్ శశాంక..
సోమవారం జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రూప్-1మెయిన్స్ పరీక్షల కేంద్రాలను రంగారెడ్డి కలెక్టర్ శశాంక సందర్శించారు. గండిపేట మండలంలోని మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మొయినాబాద్ మండలం అజీజ్ నగర్‌లోని విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భాసర్ నగర్‌లోని జోగిన్‌పల్లి బీఆర్ ఇంజినీరింగ్ కళాశాల సెంటర్లను కలెక్టర్ శశాంక పరిశీలించి మాట్లాడారు. ఈనెల 27వ తేదీ వరకు నిర్వహించే గ్రూప్-1మెయిన్స్ పరీక్షలకు సంబంధించి నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సెంటర్లలో సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్ సెంటర్లను మూసివేయడం జరిగిందన్నారు. రీజనల్ కోఆర్డినేటర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, ఫ్లయింగ్ స్వాడ్స్, సిట్టింగ్ స్వాడ్స్, ఐడెంటిఫికేషన్ అధికారులు, లైజన్ అధికారులు పరీక్ష నిర్వహణలో తమకు కేటాయించిన విధులను పూర్తి బాధ్యతతో నిర్వహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఇబ్రహీంపట్నం పరిధిలోని శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు.