రంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు తగ్గుతున్నాయి. బోరు బావుల్లో నీళ్లు అడుగంటుతుం డడంతో పొలాలు నెర్రెలు తేలి బీటలు వారుతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు అన్నదాతలు చేయని ప్రయత్నాలు లేవు. అప్పులు చేసి కొత్తగా బోర్లను 500 ఫీట్లకు పైగానే తవ్విస్తున్నా చుక్క నీరు రావడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించి పంట చేతికొచ్చే దశలో కండ్ల ముందే ఎండిపోతుండడంతో అన్నదాత కండ్లలో నీరు ఆగడం లేదు. దీంతో చేసేదేమీలేక ఆ పంటను పశువులు, గొర్రెలు, మేకలకు మేతగా వేస్తున్నారు. కాగా, కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని.. పుష్కలంగా ఉన్న నీరుతో రెండు సీజన్లలో పంటలను సాగు చేసుకుని సంతోషంగా జీవించామని అన్నదాతలు పేర్కొం టున్నారు. సకాలంలో రైతుబంధు పెట్టుబడి సాయం రావడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితే తమకు ఎదురు కాలేదని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ వస్తూ.. కరువును తీసుకొచ్చిందని.. ప్రభుత్వం జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
నాకు ఉన్న నాలుగెకరాల పొలంలో వరి పంటను సాగు చేశా. ఇందుకు ఓ వ్యాపారి వద్ద రూ. నాలుగు లక్షలను అప్పుగా తీసుకొచ్చా. ఏడు రోజుల వరకు పైపు నిండా బోరు నీళ్లు పోసింది. ఇంకో 20-25 రోజులైతే ఆ పంటను కోసి వడ్లను అమ్మి వ్యాపారికి అప్పు చెల్లిద్దామని అనుకున్నా.. కానీ, ఇంతలోనే బోరు వట్టిపోయింది.ఇప్పుడు ఆ అప్పును ఎలా చెల్లించాలో అర్థం కావడంలేదు. ఇప్పటివరకు ఉన్న అప్పులు, కుటుంబ పోషణ కూడా భారం కానున్నది. వాటిని చెల్లించేందుకు ఉన్న భూమిని అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. పొలంలోని పంటను చూస్తుంటే దుఃఖం ఆగడం లేదు. కాంగ్రెస్ సర్కార్ రూపాయీ ఇవ్వకున్నా అప్పులు తీసుకొచ్చి పంటను సాగు చేస్తే కరువు రక్కని ఆగమాగం చేసింది. కేసీఆర్ హయాంలోనే బాగుండే. సమృద్ధిగా వానలు కురిసి.. సకాలంలో పంటలను సాగుచేసుకుని సంతోషంగా జీవించాం. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది.. కరువును తీసుకొచ్చింది.
అన్నయ్య, నేను కలిసి నాలుగు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాం. ఇందుకు రూ.1,00,000 వరకు ఖర్చు పెట్టాం. ఉన్న మూడు బోర్లు నీళ్లు లేక ఎండిపోయాయి. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని అందించినా సరిపోవడం లేదు. రైతు గోస పాలకులకు పట్టడం లేదు. పంటలు ఎండిపోతున్నా మా బాధలు తెలుసుకునేందుకు ఏ ఒక్క అధికారి కూడా రావడం లేదు. పాలకులారా..? రైతు గోసను పట్టించుకోండి. ఇప్పుడు తీసుకొచ్చిన అప్పులను తీర్చే మార్గమే కనిపించడంలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
నాకు ఎకరం పొలం ఉన్నది. దానినే నమ్ముకుని బతుకుతున్నా. రూ.30,000 వరకు అప్పు చేసి వరి పంటను సాగు చేశా. ఉన్న బోరు నుంచి నీటి సరఫరా తగ్గి.. ఆ పంట పూర్తిగా ఎండిపోయింది. ఆ పంట ను చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు. గతంలో సమృద్ధిగా ఉన్న నీటితో రెండు సీజన్లలో పంటలు పండించుకుని జీవించా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు వచ్చింది. చెరువులు, కుంటలు ఎండాయి. బోర్లలోనూ నీళ్లు పాతాళానికి చేరాయి.