పరిగి/కులకచర్ల, ఏప్రిల్ 5 : బోర్లలో రోజురోజుకూ తగ్గుతున్న నీటితో పంటల సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం రాలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఎప్పటిలాగే కష్టపడి సాగు చేసిన వరి పంట ఈసారి తమను ఆదుకుంటుందనుకుంటే పెట్టిన డబ్బులు వచ్చే పరిస్థితి లేదని వారు పేర్కొంటున్నారు. వరి పంటలు ఎండిపోవడంతో వాటిలో పశువులను మేపుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉండి పంటలు పూర్తి స్థాయిలో పండి రైతులకు కన్నీరు లేకుండా సంతోషంగా ఉండేవారు. కాని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పంటల ప్రణాళికలు లేక బోర్లద్వారా, బావుల కింద పంటలు వేశారు. సర్కారు చెరువులు, కాలువలకు పూడిక, మరమ్మతులు చేయకపోవడంతో వేసవి కాలం ప్రారంభంలోనే వరి పొలాలు ఎండుముఖం పడుతుండటంతో గ్రామాల్లో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంటలు సాగుచేయడానికి ఇతరుల వద్ద తీసుకొచ్చిన అప్పులెలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారు.
పరిగి, కులకచర్ల మండలాల్లో చాలా వరకు రైతులు చెరువులు, బావుల కింద, బోర్ల సాయంతో వరిని సాగుచేశారు. పంటలు వేసిన నెల రోజులకే పంటలకు నీరందక బోర్లు, బావుల్లో నీళ్లు పూర్తిగా తగ్గిపోవడంతో తాము వేసిన పంటలను ఎలాగైనా కాపాడుకునేందుకు ప్రతి రెండు రోజులకు ఒకసారి వచ్చే నీటిని పెడుతూ రాత్రింబవళ్లు కృషిచేస్తున్నారు. వారి పంటలకు నీరు అందకపోతే పక్క పొలాల రైతుల బోర్ల నుంచి నీటిని అడిగి పంటలకు అందిస్తున్నారు. ఇలాంటి కష్టాలను గతంలో ఎప్పుడూ పడలేదని రైతులు వాపోతున్నారు. గత ప్రభుత్వం పంట వేసే సమయానికి సరైన సమయానికి రైతుల ఖాతాల్లో రైతు బంధును జమచేసేది. దీంతో ఎలాంటి భయం లేకుండా పంటను సాగుచేసేవారు. కాని కాంగ్రెస్ సర్కారు వచ్చిన తరువాత రైతు భరోసా బందు చేసి కేవలం కంటి తుడుపుగా మాత్రమే కొందరికి మాత్రమే అందిస్తూ చాలా మంది రైతులను కన్నీరు పెట్టిస్తున్నది. అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పెట్టుబడి సైతం రాని పరిస్థితి
పరిగి మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన కాకి రమేశ్ తన పొలంలో కూరగాయలు సాగు చేపట్టగా.. పక్కనే ఉన్న 3 ఎకరాల భూమిని ఎకరాకు రూ.5వేల చొప్పున కౌలుకు తీసుకున్నాడు. ఈ మూడు ఎకరాల్లో వరి సాగు కోసం తన ట్రాక్టర్తోనే దున్నడం, కరిగెట తదితర పనులు చేయగా.. విత్తనాలు, నాట్లు వేయడం, ఎరువులకు సుమారు రూ.60వేల వరకు ఖర్చు చేశాడు. 2 బోర్లు ఉండగా నీరు పూర్తిగా తగ్గిపోవడంతో కొన్ని రోజులుగా వరి పంట ఎండిపోతున్నది. దీంతో ఒక బోరులో ఫ్లషింగ్ చేయించి, కొత్త కేసింగ్ వేసేందుకు రూ.1.75 లక్షలకు పైగా వెచ్చించాడు. మొదట్లో కొంత నీరు వచ్చినా భూగర్భ జలాలు అడుగంటడంతో నీరు పూర్తిగా తగ్గిపోయి పంట ఎండిపోయింది. తద్వారా పెట్టిన పెట్టుబడి, బోరు ఫ్లషింగ్ తదితర వాటికి కలిపి సుమారు రూ.3లక్షల వరకు ఖర్చయిందని, కళ్ల ముందే వరి పంట ఎండిపోతుండడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఎండిన వరి పంట పొలంలో పశువులను మేపుతున్నట్లు తెలిపాడు. ఎంతో కొంత వరి పంట ఆదుకుంటుందనుకుంటే ఇలా జరగడమేంటని రైతు కుటుంబం దిగాలు చెందుతున్నది. సర్కారు తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.
3 ఎకరాల్లో ఎండిన వరి పంట
పరిగి మండలం రంగంపల్లి గ్రామానికి చెందిన వెల్చల అనంతయ్య, అతడి కుమారుడు పాండు సాగు చేసిన వరి పంట ఎండిపోయింది. 3 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా పెట్టుబడికి రూ.60 వేలకు పైగానే ఖర్చయిందని రైతులు తెలిపారు. గత సంవత్సరమే రూ.2.80 లక్షలు వెచ్చించి రెండు బోర్లు వేయిస్తే ఒకదాంట్లో నీరు సన్నగా వచ్చిందన్నారు. ఎలాగోలా ఈసారైనా వరి సాగుతో పెట్టుబడి ఖర్చులుపోను ఎంతో కొంత డబ్బులు చేతికి అందుతాయని ఆశించి పంట సాగు చేయగా బోరులో నీరు పూర్తిగా తగ్గిపోయింది. తద్వారా వరి పంట ఎండిపోయింది. పూర్తిగా నెర్రెలు వారి పంట చేతికి వచ్చే పరిస్థితి కరువైంది. 3 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన వరి పూర్తిగా ఎండిపోవడంతో ఏమీ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో కేసీఆర్ పాలనలోనే సాగు బాగుండేదని, నేడు వ్యవసాయానికి ఈ పరిస్థితి వచ్చిందని వాపోయారు. ప్రభుత్వమైనా తమను ఆదుకొని నష్టాల నుంచి గట్టెక్కించాలని వారు కోరుతున్నారు.
పంటలను కాపాడేందుకు ఇబ్బందులు
రైతులు పండించిన పంటను కాపాడుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెరువుల్లో నీళ్లు పూర్తిగా ఎండిపోవడంతో బోర్లలో కూడా నీటి శాతం తగ్గి వేసిన పంటలకు నీరు అందక కొంతమేర వచ్చే ప్రతి రెండు రోజులకోసారి కొంత పొలానికి నీటిని అందిస్తూ పూర్తి స్థాయిలో ఎండిపోకుండా ఉండేందుకు కష్టపడుతున్నారు. పంటలు చేతికి రావడానికి కనీసం 20 నుంచి 30 రోజుల సమయం పడనుండగా.. ఆ సమయానికి పంట చేతికి వస్తుందా అనే సందేహం ప్రతి రైతుకూ ఉన్నది. దీనికి ప్రధాన కారణం పంటలపై రైతులకు అధికారులు పూర్తిస్థాయి అవగాహన కల్పించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ముందుగానే అధికారులు ప్రణాళికలకు తయారుచేసి దానికి అనుగుణంగా పంటలు వేయాలని చెప్పేవారు.. కాని నేడు ఈ విషయంపై అధికారులు కాని, ప్రభుత్వం కాని ఎలాంటి సూచనలు, సలహాలివ్వలేదు. గతంలో అదునుకు రైతు బంధు వచ్చి పంటలకు పెట్టుబడి ఇబ్బంది ఉండేదికాదు.
– చాకలి అంజిలయ్య, మాజీ సర్పంచ్, బొంరెడ్డిపల్లి