రంగారెడ్డి, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్సిటీకోసం నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భాధిత రైతులకు పరిహారంలో ప్రభు త్వం సరైన స్పష్టత ఇవ్వటం లేదు. గ్రీన్‌ఫీల్డ్ భూనిర్వాసితులందరికీ ఒకే రకంగా పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతుండగా.. భూముల మార్కెట్ విలువను బట్టి ఇస్తామని సర్కార్ చెబుతున్నది. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు కనిష్ఠంగా రూ. 40 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 1.25 కోట్ల వరకు చెల్లించాల ని నిర్ణయించింది.
ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్, మహేశ్వరం మం డలంలోని రావిర్యాల, కందుకూరు మం డలంలోని తిమ్మాపూర్, మీర్ఖాన్పేట గ్రామాల రైతులకు అత్యధికంగా ఎకరాకు రూ.1.25 కోట్లు..అలాగే, యాచారం మండలంలోని కుర్మిద్ద, మర్లకుంటతండా, కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి, అన్మాస్‌పల్లి, ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి గ్రామాలకు ఎకరాకు రూ. 40లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. అలా గే, ఔటర్‌రింగ్‌రోడ్డు ఎగ్జిట్ నంబర్-13 వద్ద అత్యధికంగా రూ.మూడు కోట్ల వరకు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
41కిలోమీటర్లు.. 330 అడుగుల వెడల్పు..
జిల్లాలో భారత్ ఫ్యూచర్‌సిటీ కోసం ప్రభుత్వం 330 అడుగుల వెడల్పుతో 41.5 కిలోమీటర్ల పొడవుతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును నిర్మిస్తున్నది. మొదటి విడతలో ఔటర్‌రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్-13నుంచి మీర్ఖాన్పేట వరకు 20 కిలోమీటర్ల రోడ్డుకోసం 449 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెండో విడతలో మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు 21.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 554 ఎకరాలను సేకరిస్తున్నది. ఈ ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు వరకు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రోడ్డుకోసం సేకరించే భూమికి అధికారులు రెండు మూడు రకాలుగా పరిహారాన్ని చెల్లించాలని నిర్ణయించడంతో రైతులు ససేమిరా అంటున్నారు.