రంగారెడ్డి, జనవరి 13(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రంగారెడ్డి జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి రూ.42 కోట్ల 96 లక్షలు మంజూరు అయ్యాయని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా ప్రజల తరఫున మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
చేవెళ్ల నియోజకవర్గానికి కోటీ 98 లక్షలు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రూ.9 కోట్ల 48 లక్షల 50 వేలు, కల్వకుర్తి నియోజకవర్గానికి రూ.9 కోట్ల 14 లక్షలు, మహేశ్వరం నియోజకవర్గానికి రూ.9 కోట్ల 6 లక్షలు, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి రూ.5 కోట్లు, షాద్నగర్ నియోజకవర్గానికి రూ.8కోట్ల 30 లక్షల 20వేల నిధులు విడుదలైనట్టు మంత్రి తెలిపారు. అదే విధంగా చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి మరో 10 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రెండో విడుతలో అవి మంజూరు కానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా శాసన సభ్యుల సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నిధులు విడుదల చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.