పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకోసం పౌర పఠన కేంద్రాల(పబ్లిక్ రీడింగ్ రూమ్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుగా మొదటగా రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో పఠన కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. కందుకూరు మండలం మాదాపూర్, కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లిలో ఏర్పాటు చేసిన సెంటర్లను గురువారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించనున్నారు. దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లోని మేజర్ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ సెంటర్లలో పోటీ పరీక్షల మెటీరియల్తోపాటు అన్ని వార్తా పత్రికలను అందుబాటులో ఉంచనున్నారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని అభ్యర్థులకు ఈ కేంద్రాలతో ఎంతో మేలు జరుగనున్నది.
ఇబ్రహీంపట్నం, జనవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసిన నేపథ్యంలో పోటీపరీక్షలకు హాజరయ్యే యువత కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 80,912 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయగా కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఈ ఉద్యోగాల్లో పాల్గొనాలనుకునే యువత పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని గ్రామీణ ప్రాంతాలవారి కోసం జిల్లా గ్రంథాలయసంస్థ ఆయా గ్రామాల్లో పౌర పఠణ కేంద్రాల(పబ్లిక్ రీడింగ్ రూం)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రంగారెడ్డిజిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందుకోసం జిల్లా గ్రంథాలయ సంస్థకు బాధ్యతలను అప్పగించింది.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మేజర్ గ్రామపంచాయతీల్లో పబ్లిక్ రీడింగ్ రూంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా గ్రామపంచాయతీల్లో ఒక్క గది తీసుకుని అందులో పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచటంతో పాటు వివిధ వార్తా పత్రికలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ పబ్లిక్ రీడింగ్ రూంలలో గ్రంథాలయ సంస్థ నుంచి 20 కుర్చీలు, 2 టేబుళ్లు, 2 అల్మారాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణను సంబంధిత గ్రామపంచాయతీలకు అప్పగించి ప్రతి నెల రూ.1500 నుంచి రూ.2వేల వరకు కూడా గ్రంథాలయ సంస్థ నుంచి అందజేయనున్నారు. ఈ పబ్లిక్ రీడింగ్ రూంలలో చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించేలా గ్రంథాలయ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది.
దశలవారీగా జిల్లావ్యాప్తంగా పబ్లిక్ రీడింగ్ రూంలు
జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పబ్లిక్ రీడింగ్ రూంలను దశలవారీగా జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. మొట్టమొదట కందుకూరు మండలంలోని మాదాపూర్, కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లిలో వీటిని ప్రారంభించనున్నారు. వీటి అనంతరం నియోజకవర్గానికి పది నుంచి పదిహేను చొప్పున మేజర్ గ్రామపంచాయతీల్లో పబ్లిక్ రీడింగ్ రూంలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున మాత్రమే లైబ్రరీలున్నాయి. వివిధ గ్రామాల నుంచి లైబ్రరీకి వెళ్లి చదువుకునేందుకు అవకాశం లేకుండా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్నచిన్న గ్రామాలను కలిపి మేజర్ గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూంలను ఏర్పాటుచేస్తే అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. పబ్లిక్ రీడింగ్ రూంలను పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని రకాల మెటీరియల్ లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టేబుళ్లు, కుర్చీలతో పాటు తాగునీరు, లైటింగ్ వసతి కూడా కల్పిస్తున్నారు.
పఠనా కేంద్రాలను నేడు ప్రారంభించనున్న మంత్రి సబితారెడ్డి
రంగారెడ్డిజిల్లాలోని మాదాపూర్, ఎక్వాయిపల్లి గ్రామాల్లో గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పబ్లిక్ రీడింగ్ రూంల ప్రారంభోత్సవానికి మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి అరుణ, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరవుతున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకటరమణారెడ్డి తెలిపారు.
పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో..
– వెంకటరమనారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
రంగారెడ్డిజిల్లాలో గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత కోసం వినూత్నంగా పబ్లిక్ రీడింగ్రూం (పౌర పఠన కేంద్రా)లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలు.. అలాగే, జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన పుస్తకాలు, వార్తా పత్రికలు కూడా అందుబాటులో ఉంచుతాం. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పబ్లిక్ రీడింగ్ రూంలలో చదువుకోవటానికి వచ్చే యువతకు అన్ని వసతులను కల్పిస్తాం. వీటి నిర్వహణ కోసం సంబంధిత గ్రామపంచాయతీలకు జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి ప్రతి నెల డబ్బులను కూడా అందించనున్నాం.