రంగారెడ్డి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) ; రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు తమ ధాన్యాన్ని పొలాలు, రోడ్లపై నిలువ ఉంచుతున్నారు. ఎవరు కొంటారా అని పడిగాపులు కాస్తున్నారు. చివరకు దిక్కుతోచక దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. రంగారెడ్డి జిల్లాలో గత 15 రోజులుగా రైతులు వరి పంటను కోసి అమ్మకానికి ఎదురు చూస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. మరోవైపు బ్యాంకు గ్యారెంటీ తప్పనిసరి అని సర్కారు నిబంధన విధించడంతో మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు ముందుకు రావడంలేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, కల్వకుర్తి తదితర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు లేక లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కల్లాల్లో నిలువ ఉంచారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, బ్యాంకు గ్యారెంటీ కొర్రీలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
రంగారెడ్డి జిల్లాలో వానకాలం సీజన్లో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ సీజన్లో ముందుగానే జిల్లాలో 1.38 లక్షల ఎకరాల్లో వరి వేశారు. దీంతో కోతలు కూడా ముందుగానే ప్రారంభమయ్యాయి. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం శోచనీయం.
క్వింటాలు రూ.2200లకే..
ఓ వైపు బ్యాంకుల గ్యారెంటీ కొర్రీలతో కొనుగోలుకు మిల్లర్లు దూరంగా ఉన్నారు. మరోవైపు సర్కారు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం సన్న బియ్యానికి మద్దతు ధరతోపాటు రూ.500 అదనంగా ఇస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం అందనంత దూరంలో ఉన్నది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా దళారులు క్వింటాలుకు రూ.2200లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
ఎక్కడ చూసినా ధాన్యపు రాసులే..
జిల్లాలో వరి కోతలు ప్రారంభం కావడం.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో ఎక్కడ చూసినా ధాన్యపు రాసులే దర్శనమిస్తున్నాయి. రైతులు కొంతమంది పంట పొలాల్లో నిల్వ ఉంచగా.. మరికొంతమంది రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు.
గిట్టుబాటు ధర కల్పించాలి
ప్రభుత్వానికి రైతులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి. గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.500 బోనస్ ఇవ్వాలి. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న రేవంత్ సర్కార్ రైతులపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నది. ఈ ధోరణి విడనాడి రైతుల శ్రేయస్సు కోసం పనిచేయాలి.
– కాలె వీరయ్య, రైతు, ముర్తుజాపల్లి, ఆమనగల్లు మున్సిపాలిటీ
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించడానికి వరి కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటను సేకరించేందుకు సర్కారు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. అకాల వానలు కురిస్తే ధాన్యం తడిసిపోయే ప్రమాదమున్నది. దీంతో దళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి.
– జోగు వీరయ్య, రైతు, కడ్తాల్ మండలం
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు లేకపోవడం శోచనీయం. దీంతో అన్నదాతల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఎటూతోచని స్థితిలో దళారులను ఆశ్రయిస్తున్నారు. వెంటనే సర్కారు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
– సుధాకర్‌రెడ్డి, రైతు
నేడు మిల్లర్లతో సమావేశం
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు నేడు మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. 16 మంది మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయనున్నారు. ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ తప్పనిసరి చేసిన నేపథ్యంలో మిల్లర్లు కొంత వెనుకడుగు వేస్తున్నారు. వారిని ఒప్పించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ కూడా అందజేస్తాం.
– గోపి, డీఎం, సివిల్ సప్లయ్