నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆహ్లాదకర వాతావరణంలో చక్కని పాఠశాల గదులను నిర్మించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా బడుల ముఖచిత్రాలు సమూలంగా మారుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు భారీగా నిధులను వెచ్చించి ఇబ్బందులతో సతమతమవుతున్న పాఠశాలలను మొదటి విడుతలో ఎంపిక చేసింది. సరికొత్త హంగులతో సర్కారు బడులు బలోపేతం అవుతున్నాయి. పాఠశాలల్లో విద్యుద్దీకరణ, టాయిలెట్స్, తాగునీటి సరఫరా, ఫర్నిచర్, పెయింటింగ్, పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్, డిజిటల్ విద్య మొదలైన నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. బడుల్లో మౌలిక వసతులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.11లక్షలతో శివారెడ్డిపల్లి పాఠశాల ఆధునీకరణ
– సత్యం, ఎస్ఎంసీ చైర్మన్, శివారెడ్డిపల్లి పాఠశాల
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి ఆధునిక వసతుల కల్పనతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. మొదటి విడుత కింద 25 పాఠశాలలను ఎంపిక చేయగా.. శివారెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. రూ.11లక్షలతో పాఠశాలలో బెంచీల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, చిన్నచిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, కిటికీలు, గోడలపై మహనీయుల చిత్రాలు, పాఠశాల భవనానికి పెయింటిగ్, ప్రహరీ, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను కల్పించి పాఠశాలను ఆధునీకరించి త్వరలో పనులు పూర్తి చేసి ప్రారంభిస్తాం.
విద్యార్థుల తల్లిదండ్రులకు ఆసక్తి పెరిగింది : హరిశ్చందర్, దోమ మండల విద్యాధికారి
మౌలిక వసతులు కల్పించనుండడంతో తమ పిల్లలను సర్కారు బడులకు పంపించేందుకు తల్లిదండ్రులకు ఆసక్తి పెరిగింది. అన్ని పాఠశాలల్లో అన్ని పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు అమలు చేయడంతో మరింత ఆదరణ పెరిగింది. విద్యాప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. విద్యార్థులకు అధునాతన పద్ధతుల ద్వారా పాఠాలు బోధించడంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాల్లో విద్యార్థులను నిష్ణాతులను చేయడంతో తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై భరోసా పెరిగింది.
ప్రైవేటు పాఠశాలగా కనిపిస్తున్నది
– రాధిక, 4వ తరగతి, శివారెడ్డిపల్లి పాఠశాల
మా పాఠశాల గతంలో కళావిహీనంగా ఉండేది. నేడు పాఠశాల ప్రైవేటు పాఠశాల మాదిరిగా కనిపిస్తున్నందున మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో మా పాఠశాలలో సరైన వసతులు లేక బాధపడ్డాం. ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మా ఊరి నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పిల్లలు కూడా మా పాఠశాలకు వస్తున్నారు. పాఠశాల మార్పును చూసి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కోట్‌పల్లి, ఫిబ్రవరి 2 : కోట్‌పల్లి మండలంలో మొదటి విడుతలో భాగంగా 9 పాఠశాలలను ఎంపిక చేసిందని మండల విద్యాధికారి చంద్రప్ప తెలిపారు. దీంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. 9 పాఠశాలల అభివృద్ధికి రూ.కోటీ80లక్షలను ప్రభుత్వ కేటాయించింది. ఈ నిధులతో మరుగుదొడ్లు, కిటికీలు, తరగతి గదులు, కిచెన్ షెడ్లు, ఫ్యాన్లు, ప్రహరీలు, ఫ్లోరింగ్, నీటి సంపులు, ఎలక్ట్రికల్ వర్క్, పెయింటింగ్ పనులు చేపట్టగా.. 90 శాతం పనులను పూర్తయ్యాయి. మిగతా పనులు నాలుగు రోజుల్లో పూర్తవుతాయి.
కులకచర్ల, ఫిబ్రవరి 2 : మండలంలో 26 పాఠశాలలను ఎంపిక చేశారు. దీనికిగాను ప్రభుత్వం రూ.3 కోట్ల75లక్షలను మంజూరు చేసింది. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.5కోట్ల పనులు ఆయా పాఠశాలల్లో చేపట్టనున్నారు. పనులు పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.
బొంరాస్‌పేట, ఫిబ్రవరి 2 : మండలంలో మొదటి విడుతలో 25 పాఠశాలలను ఎంపిక చేశారు. పాఠశాలల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్లు, ప్రహరీలు, విద్యుత్ సౌకర్యం, చిన్నాపెద్ద మరమ్మతులు, అవసరమైతే కొత్త తరగతి గదుల నిర్మాణంతో పాటు ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. మండలంలో ఎంపిక చేసిన 25 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.4.04 కోట్లు మంజూరు చేసింది. మంజూరైన నిధుల్లో ఇప్పటివరకు రూ.24 లక్షలను ఖర్చు చేశారు.
ఎంపిక చేసిన పాఠశాలలు ఇవే..
రేగడిమైలారం ఉన్నత పాఠశాల, సీపీఎస్ దుద్యాల, సీపీఎస్ బొంరాస్‌పేట, చెట్టుపల్లితండా, పీఎస్ చౌదర్పల్లి, పీఎస్ దీప్లానాయక్తండా, పీఎస్ దళితవాడ దుద్యాల, పీఎస్ ఎన్నెమీదితండా, లింగన్‌పల్లి, మదన్‌పల్లితండా, మెట్లకుంట, నాగిరెడ్డిపల్లి, పీఎస్ రేగడిమైలారం, తుంకిమెట్ల, జీయూపీఎస్ బొంరాస్‌పేట, ఉర్దూ మీడియం బొంరాస్‌పేట, అల్లికాన్పల్లి, ఉర్దూ మీడియం దుద్యాల, ఏర్పుమళ్ల, కొత్తూరు, మహంతీపూర్, వడిచెర్ల, ఎనికేపల్లి, బొంరాస్‌పేట ఉన్నత పాఠశాల, దుద్యాల ఉన్నత పాఠశాల. వీటిలో పైలట్ ప్రాజెక్టు కింద దీప్లానాయక్తండా, చెట్టుపల్లితండా ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేశారు. రూ.10 లక్షలతో పనులు పూర్తయిన చెట్టుపల్లితండా పాఠశాలను బుధవారం ప్రారంభించారు. మిగతావాటిని ఈ విద్యా సంవత్సరం చివరి నాటికి ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
బుధవారం ప్రారంభించిన చెట్టుపల్లితండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, నీటి వసతి, మరుగుదొడ్లు, గ్రీన్‌చాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. పాఠశాలకు అవసరమైన విద్యుత్‌ను వినియోగించుకోవడానికి సౌర పలకాలను ఏర్పాటు చేశారు. త్వరలో గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
దోమ, ఫిబ్రవరి 2 : విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద దోమ మండలంలో 25 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో శివారెడ్డిపల్లి, గుండాల పాఠశాలలో పనులు చివరి దశకు చేరుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇతర పాఠశాలల్లో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎంపికైన పాఠశాలలకు ఆకర్షణీయమైన పెయింటింగ్‌లు తదితర వసతులు కల్పిస్తున్నారు.
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
– రాజశేఖర్‌గౌడ్, వైస్ ఎంపీపీ, కులకచర్ల
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయడంతో పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారి మంచి ఫలితాలను అందించనున్నాయి. మండల పరిధిలో ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు పూర్తవుతున్నాయి. మౌలిక సదుపాయాల పనులతో పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయి.
మా స్కూల్‌ను ఎంతో అందంగా మార్చారు
– కావ్య, 8వ తరగతి, తిమ్మాపూర్
మా స్కూల్ గతంలో పాడుబడినట్లుగా ఉండేది. నేడు దాన్ని ఎంతో అందంగా తయారుచేశారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించారు.. ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. కరెంటు సదుపాయం కల్పించారు. ల్యాబ్, క్లాస్‌రూంలో ఫ్యాన్లు మొదలగునవి చక్కగా పనిచేస్తున్నాయి. మా పాఠశాలను ఇలా మార్చినందకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
మా పాఠశాల బాగైంది
– లచ్చానాయక్, చెట్టుపల్లితండా
మన ఊరు-మన బడితో మా తండా పాఠశాల బాగైంది. ఇంతకు ముందున్న పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండే. ఇప్పుడు తాగడానికి నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, కూర్చోవడానికి బెంచీలు, కరెంటు అన్ని సౌకర్యాలు కల్పించారు. కేసీఆర్ చదువు కోసం శ్రద్ధ చూపిస్తున్నారు.
తిమ్మాపూర్ యూపీఎస్‌ను మోడల్‌గా తీర్చిదిద్దాం : బాలీశ్వర్, ప్రధానోపాధ్యాయుడు, యూపీఎస్, తిమ్మాపూర్
తిమ్మాపూర్ యూపీఎస్‌ను మోడల్‌గా తీర్చిదిద్దాం. స్కూల్లో విద్యుత్ పనులు, నాలుగు బాత్రూంలో కుండీలు, ఆట వస్తువులు, టైల్స్, ఫ్లోరింగ్, డ్రైనేజీ సిస్టం, కిటకీల రిపేర్ మొదలగువాటిని చేయించాం. దీంతో పాఠశాల రూపు రేఖలు మారడం చాలా సంతోషంగా ఉంది.
కొత్తూరు, ఫిబ్రవరి 2 : మండలంలో 11 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో ఎంపీపీఎస్ ఇన్ముల్‌నర్వ ఎంపీపీఎస్ కొత్తూరు, ఎంపీపీఎస్ కొత్తూరు (హెచ్‌డబ్ల్యూ), ఎంపీపీఎస్ కొత్తూరు (యూఎం), ఎంపీపీఎస్ పెంజర్ల, ఎంపీపీఎస్ ఎస్బీపల్లి, ఎంపీపీఎస్ సిద్దాపూర్, ఎంపీయూపీఎస్ తిమ్మాపూర్, జడ్పీహెచ్ఎస్ ఇన్ముల్‌నర్వ, జడ్పీహెచ్ఎస్ కొత్తూరు, జడ్పీహెచ్ఎస్ పెంజర్ల ఉన్నాయి. ఇందుకోసం రూ.41,604,304 కేటాయించారు. ఈ పాఠశాలల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందులో తిమ్మాపూర్ యూపీఎస్, కొత్తూరు ప్రైమరీ స్కూల్‌ను మోడల్ పాఠశాలలుగా మార్చుతున్నారు. తిమ్మాపూర్ యూపీఎస్‌లో అన్ని పనులు పూర్తయ్యాయి. కొత్తూరు ప్రైమరీ స్కూల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. పెంజర్ల, ఎస్బీపల్లిలో నూతన భవనాలను నిర్మిస్తున్నారు.