బొంరాస్‌పేట, మార్చి 3 : వారంతా చిన్నప్పటి నుంచి కష్టపడి చదివారు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావడంతో రాత్రింబవళ్లు చదివి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రకటించిన గురుకుల డిగ్రీ, జూనియర్ లెక్చరర్, టీజీటీ ఉద్యోగాలను సాధించారు దుద్యాల, బొంరాస్‌పేట మండలాల్లోని యువతీయువకులు.
దుద్యాల మండలంలోని లగచెర్లకు చెందిన సంగు అన్నపూర్ణ కోటి ఉమెన్స్ కళాశాలలో తెలుగులో పీజీ చదివింది. రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ పూర్తి చేసింది. భర్త నరేశ్‌తో పాటు పోటీ పరీక్షలకు కష్టపడి చదివింది. గురుకుల డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, టీజీటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసింది. ఇటీవల ఫలితాలు ప్రకటించిన ఈ మూడు ఉద్యోగాలకు ఎంపికైంది. గత ఏడాది కేజీబీవీ ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్వహించిన పరీక్షలో జిల్లాలోమొదటి ర్యాంకు సాధించిన అన్నపూర్ణ ప్రస్తుతం వికారాబాద్ కేజీబీవీలో తెలుగు పండిట్‌గా పని చేస్తున్నది. వ్యవసాయ కుటుంబానికి చెందిన అన్నపూర్ణ ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంపై కుటుంబంతో పాటు గ్రామస్తులు అభినందిస్తున్నారు.
దుద్యాల మండలంలోని ఈర్లపల్లి గ్రామానికి చెందిన వన్నారెడ్డి, పార్వతమ్మల కొడుకు మధుసూదన్‌రెడ్డి గురుకుల డిగ్రీ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి చనిపోయినా చిన్నాన్న పుల్లారెడ్డి ప్రోత్సాహంతో వికారాబాద్ ఎస్ఏపీ కళాశాలలో డిగ్రీ, ఓయూలో ఎంఎస్సీ చదివాడు. పాండిచ్చేరి ఎన్ఐటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు. కష్టపడి చదివి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని సాధించాడు.
కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన సుజాత బొంరాస్‌పేట మండలంలోని బాపల్లితండాకు చెందిన గోపాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నది. పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ పూర్తి చేసిన సుజాత భర్త ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు ప్రిపేరైంది. కష్టపడి చదివి సాంఘిక శాస్త్రం టీజీటీ ఉద్యోగానికి ఎంపికైంది. ఆమెను పలువురు తండా ప్రజలు అభినందించారు.