షాబాద్, డిసెంబర్ 7: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే శుభోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని సంకెపల్లిగూడ, శేరిగూడ గ్రామాల్లో స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డితో కలిసి శుభోదయం కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నల్లానీరు అందించడంతో తాగునీటి కష్టాలు దూరమయ్యాయని తెలిపారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేద ప్రజలకు సర్కార్ అండగా నిలుస్తున్నదని చెప్పారు. గ్రామాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. శుభోదయం పేరిట గ్రామాల్లో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమ్మరి దర్శన్, ఉప సర్పంచ్ మల్లాపురం రాజేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూర్ నర్సింగ్‌రావు, ఎంపీడీవో అనురాధ, ఎంపీవో హన్మంత్‌రెడ్డి, డీఈఈ విజయ్‌కుమార్, ఏఈలు శ్రీదివ్య, నరేందర్, శారద, ఏపీఎం నర్సింహులు, ఏఈవో రాజేశ్వరి, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తొంట వెంకటయ్య, నాయకులు హరీఫ్, సత్యం, యాస మల్లారెడ్డి, రమేశ్‌యాదవ్, రాఘవేందర్‌గౌడ్, నర్సింహులు, నానిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.