హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థకు తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం విరుద్ధమైన ప్రకటనలు జారీచేశాయి. ఈ బ్లాక్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక లెక్క చెప్పగా, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో లెక్క చెప్పడం గమనార్హం. దీంతో ఎవరు చెప్పింది నిజం, ఎవరు చెప్పినవి నమ్మాలి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాడిచెర్ల కోల్‌బ్లాక్-2లో 182 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వులున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. 434.14 మిలియన్ టన్నుల నిల్వలుండగా, వీటిలో 340 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ గనులతో ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని కిషన్‌రెడ్డి చెప్పగా, ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ బ్లాక్‌లో మేలురకమైన జీ-8 రకం బొగ్గు లభిస్తుందని కిషన్‌రెడ్డి చెప్పగా, జీ-9 గ్రేడ్ బొగ్గు లభిస్తుందని భట్టి సెలవిచ్చారు. ఈ కోల్బ్లాక్తో 1,200 మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని కిషన్‌రెడ్డి చెప్పగా, ప్రత్యక్ష్యంగా.. పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని భట్టి చెప్పారు.