సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉండగా కొన్నినెలలుగా ఒక్క పైసా విడుదల చేయడంలేదు. దీంతో స్టేషన్లో చిన్న గుండుసూది మొదలు.. డీజిల్ వరకు సొంతంగా భరించాల్సి రావడంతో పోలీసులు అయోమయంలో పడిపోతున్నారు. ఒకవైపు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల వద్ద ఒక్కరూపాయి కూడా తీసుకోవద్దని చెబుతున్న ప్రభుత్వం స్టేషన్ నిర్వహణ కోసం మెయింటెనెన్స్ నిధులు మాత్రం ఇవ్వడం లేదు. గత పదేళ్లలో ఎప్పుడూ లేని దుస్థితి ఇప్పుడు వచ్చిందని పోలీసులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు పోలీస్స్టేషన్ల నిర్వహణకు ప్రభుత్వాలు ఎలాంటి నిధులు ఇచ్చేవి కావు. దీంతో పోలీసులు ఎంతో కొంత ఫిర్యాదుదారుల నుంచి వసూలు చేయాల్సి వచ్చేది. ఈ దుస్థితి ఉండొద్దని తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటైన కేసీఆర్ సర్కార్ ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు స్థాయిలను బట్టి మెయింటెనెన్స్ కింద నిధులు కేటాయించింది. దీంతో పీఎస్ ఖర్చుల కోసం ఫిర్యాదుదారులను పీడించడం తగ్గిపోయింది. కానీ మళ్లీ పోలీసుల అవస్థలు, ఫిర్యాదుదారుల నుంచి డబ్బులు తీసుకోవడాలు ఈ ప్రభుత్వం వచ్చాక మొదలయ్యాయి.
తమ జేబులనుంచే పెట్టుకోవాలి..!
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 71 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని కొత్తవి కాగా ప్రతీ పోలీస్ స్టేషన్‌కు నెలవారీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.75 వేలు ప్రభుత్వం విడుదల చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పీఎస్‌ల మెయింటెనెన్స్ ఖర్చుల విషయంలో ఎప్పుడూ వెనకాడలేదు. నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయడం వల్ల పోలీసులు తమ స్టేషన్ల నిర్వహణ కోసం వేరేవారిపై ఆధారపడకుండా ఉండేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మళ్లీ తలెత్తిందని స్వయంగా పోలీసులే చెబుతుండటం గమనార్హం. ప్రధానంగా నగరంలోని కమర్షియల్ డివిజన్ పరిధిలో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లలో నిరంతరం వీఐపీల రద్దీ కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చే ఫిర్యాదుదారుల కంటే వీఐపీలు, ఉన్నతాధికారులే ఎక్కువగా వస్తుండటంతో మెయింటెనెన్స్ తడిసి మోపెడవుతున్నది. అసలే మెయింటెనెన్స్ రాక తలలు పట్టుకుంటుంటే వచ్చేవారికి మర్యాదలు చేయాల్సి రావడం.. ఒకవేళ వారిని పట్టించుకోకపోతే తమ పై అధికారులు ఎలా స్పందిస్తారో తెలియక స్టేషన్ ఆఫీసర్లు ఆందోళన చెందుతున్నారు. తమ జేబులనుంచి ఈ మెయింటెనెన్స్ పెట్టుకోవలసిన పరిస్థితి వస్తున్నదని చెబుతున్నారు.
స్టేషనరీ మొదలు డీజిల్ వరకు..!
కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ప్రతీనెలా పోలీస్స్టేషన్లకు మెయింటెనెన్స్రాక పోలీసులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. డీజిల్ కోసం పెట్రోల్ బంక్‌లకు వెళ్లి ఖాతా పెడుతున్నారు. అయితే ఈ మెయింటెనెన్స్ కూడా స్టేషన్‌కు వచ్చే వారి దగ్గరి నుంచో లేక ఎవరైనా లీడర్లు పీఎస్ నిర్వహణకు ఉంచుకోండంటూ ఇస్తేనో పెట్టుకోవలసి వస్తున్నది తప్ప ప్రభుత్వం నుంచి పైసా రావడం లేదని.. తాము దర్యాప్తు జరపాలంటే కూడా కష్టమవుతుదని పోలీసులు వాపోతున్నారు. పెండింగ్ కేసులు పెరుగుతున్నాయంటూ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు.. నిందితులను పట్టుకోలేరా అంటూ చీవాట్లు.. వీటన్నిటికీ కారణం ఒక్కటే డబ్బులు లేకపోవడం. తాము నిందితుల కోసం గాలించే సమయంలో డబ్బులిస్తాం.. మీరు పెట్టుకోండంటూ చెప్పి ఆ తర్వాత ఇవ్వకపోవడంతో దర్యాప్తు ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతున్నదని ఒక పోలీస్ అధికారి చెప్పారు. తమను డబ్బులు తీసుకోవద్దంటూనే ఇంత ఖర్చెలా భరించాలో ప్రభుత్వమే చెప్పాలంటూ ప్రశ్నించారు. నిధుల విడుదల విషయంలో ప్రభుత్వ అలసత్వం పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేలా ఉందని వారు బాధపడుతున్నారు.