కొడంగల్, జనవరి 14 : ధనుర్మాస ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే గోదాదేవి అమ్మవారి కల్యాణ మహోత్సవం శనివారం మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అర్చకుల వేదమంత్రోచ్ఛాణల మధ్య వైభవంగా జరిగింది. స్వామివారిని కల్యాణం చేసుకునేందుకు గోదాదేవి అమ్మవారు ధనుర్మాసంలో నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో స్వామివారిని తిరుప్పావై పారాయణంతో మేల్కొలిపి పూజించి ప్రసన్నం చేసుకుంటుందని ఆలయ పండితులు ధరూరి శ్రీనివాసాచార్యులు తెలిపారు. సంవత్సరంలో ఈ ఒక్కరోజే వేంకటేశ్వరుడితో గోదాదేవి పరిణయాన్ని చూసే భాగ్యం కలుగుతుందని.. గోదాదేవి కల్యాణోత్సవం సాక్షాత్తు తిరుమలలో జరుగుతున్నట్లుగా అనుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్తలు అమ్మవారికి, స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. కల్యాణోత్సవంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణలతో మార్మోగింది. గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ముగిశాయి.
చిలుకూరులో..
మొయినాబాద్ : ధనుర్మాసం చివరి రోజు భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని చిలుకూరు బాలాజీ ఆలయంలోని అద్దాల మహల్లో అర్చకులు పురావస్తు రంగాచార్యులు ఆధ్వర్యంలో పూల పందిరి, పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గోదాదేవి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు రంగరాజన్ గోదా కల్యాణం విశిష్టతను భక్తులకు వివరించారు. ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయానికి వచ్చిన భక్తులు మహాద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు నరసింహ, కన్నయ్య, కిట్టుస్వామి, మురళిస్వామి, కృష్ణమూర్తి పాల్గొన్నారు.