సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ): వ్యర్థాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అభాసుపాలవుతున్నది. అధికార పార్టీ కార్పొరేటర్లే బల్దియా విధానాలను తప్పుపడుతున్నారు. పారిశుధ్య నిర్వహణలో అక్రమాల కట్టడిలో వైఫల్యం చెందిన యంత్రాంగం..తాజాగా లెగసీ వేస్ట్ (పాత చెత్త) తొలగింపునకు స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. తొలి విడత ఈ నెల 16 నుంచి 22 వరకు చేపట్టేందుకు రంగంలోకి దిగింది.
ప్రతి సర్కిల్‌కు రెండేసి వాహనాలతో ప్రత్యేక బృందాలు లెగసీ వేస్ట్ తరలింపు చేపట్టేందుకు తొలి రోజు హడావుడిగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ చాలా సర్కిళ్లలో చెత్త తరలింపునకు వాహనాలు సమకూర్చలేదు. కొన్ని చోట్ల ఒక్క వాహనంతో సరిపెట్టారు. అదేమని అడిగితే రాంకీ సంస్థ ప్రతినిధులు వాహనాలు పంపలేదని క్షేత్రస్థాయిలో సమాధానాలు వస్తున్నాయి. దీంతో ప్రత్యేక ప్రణాళికలతో కాలనీలు, బస్తీల్లో వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తొలగించే పనులు నిలిచిపోవడంతో స్పెషల్ డ్రైవ్ విధానాన్ని స్థానిక ప్రజలే కాదు, స్వయంగా అధికార పార్టీ కార్పొరేటర్లూ తప్పుపడుతున్నారు.
శుక్రవారం మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ స్పెషల్ డ్రైవ్ విధానంలో లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం ఈ నెల 21, 22 వ తేదీల్లో సీ అండ్ వ్యర్థాలు (భవన నిర్మాణ) తొలగిస్తామని చెబుతున్నారు. మొత్తంగా తొలి దశలోనే అభాసుపాలు కావడం, రెండో దశలో ఈ నెల 23 నుంచి 29వరకు, మూడో దశలో నవంబర్ 2 నుంచి 8 వరకు ఏ మేర పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారన్నది ప్రశ్నగా మారింది. సందెట్లో సడేమియాలా కొందరు చెత్తను ఎత్తకుండా ఎత్తినట్లు బిల్లులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి.