వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అందుకోసం ఎంతైనా ఖర్చు చేసేందుకూ వెనుకాడడం లేదు. ఖర్చు భరించే స్థోమత లేనివారు వినూత్నంగా ఆలోచిస్తూ తమ జ్ఞాపకాలకు చిరునామాలుగా మార్చుకుంటున్నారు. పుట్టిన రోజులు, మ్యారేజ్డేలు, ఇతర ముఖ్యమైన తేదీలను తమ వాహనాల నంబర్లలో వచ్చేలా చూసుకుంటున్నారు. ఫ్యాన్సీ నంబర్లతో పోలిస్తే ఇందుకు అయ్యే ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. సెల్‌ఫోన్ నంబర్లలోనూ తమకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఉండేలా ఎంపిక చేసుకుంటున్నారు.
హయత్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 26 : బండికి ఉండే నంబర్‌నే చాలా మంది బ్రాండ్‌గా భావిస్తున్నారు. అందుకే ఫ్యాన్సీ నంబర్ కోసం పోటీ పడుతున్నారు. రూ.లక్షలు ఖర్చయినా పెట్టేస్తున్నారు. అయితే, అంత ఖర్చు భరించే స్థోమత లేనివారు మాత్రం తమ జ్ఞాపకాలకు అనుగుణంగా నంబర్లను ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. యూత్ అయితే తమ పుట్టిన రోజులు, గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే, లేదంటే గర్ల్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసిన రోజులు కలిసి వచ్చేలా నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. కొత్తగా పెండ్లయినవారు మ్యారేజ్ డే, పిల్లలున్న వారు వారి పుట్టినరోజు తేదీలు కలిసొచ్చేలా చూసుకుంటున్నారు.
కొత్త బైక్ కొనుగోలు చేసినా.. కొత్త కారును తీసుకున్నా.. ముందుగా దానికి మంచి నంబర్ కోసం ఆరాటపడుతున్నారు. ప్రధానంగా ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో టీఎస్ 09 ఎఫ్‌వీ 9999 నంబర్ కోసం ఓ సంస్థ ఏకంగా రూ.10.5 లక్షలు వెచ్చించి వేలంలో దక్కించుకున్నది. ఇక అదే సిరీస్‌లోని 0009 నంబర్ కోసం ఒకరు రూ.3.5 లక్షలు వెచ్చించారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని చాలా మంది వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకు తమ పెండ్లి రోజు, పిల్లల పుట్టిన రోజులు నంబర్లలో వచ్చేలా చూసుకుంటున్నారు. ఉదాహరణకు.. తన కుమార్తె గత ఏడాది మార్చి 2వ తేదీన పుట్టినదనుకుంటే.. అందుకు తగ్గట్టుగా నంబర్‌ను 2321 వచ్చేలా చూసుకుంటున్నారు. ఫ్యాన్సీ నంబర్లతో పోలిస్తే ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువగానే ఉంటున్నది. నంబర్ దొరకడం కూడా సులువే. ఇటీవల ఈ ట్రెండ్ కొంచెం పెరిగిందని రవాణాశాఖ అధికారులు సైతం పేర్కొంటున్నారు. ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ పెరిగినప్పటికీ.. మిగతా ఇష్టమైన నంబర్ల ఎంపికకూ వాహనదారులు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు.
సెల్‌ఫోన్ నంబర్ల ఎంపికలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతున్నది. వీటిలోనూ ఫ్యాన్సీ నంబర్లు దొరికే పరిస్థితి చాలా తక్కువగా ఉంటున్నది. అందుకే ఎక్కువమంది పెండ్లి రోజులు, పిల్లలు పుట్టిన తేదీలు వచ్చేలా నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఉదాహరణకు 1984 ఆగస్టు 6వ తేదీన పుట్టాడు అనుకుంటే.. మొదటి మూడు నంబర్లు తప్పిపోయినా.. మిగతా నంబర్లన్నీ 0681984.. పుట్టిన రోజు తేదీతో సరిపోయేలా ఎంచుకుంటున్నారు. ఇందుకోసం అవసరమైతే కొంతకాలం వేచి చూస్తున్నారు. ఆయా టెలికాం కంపెనీలు, తెలిసిన దుకాణాల్లో సంప్రదించి కొంచెం ఖర్చయినా వెచ్చిస్తున్నారు. ఇలా పుట్టిన రోజులు, ఇతర ముఖ్యమైన రోజులు కలిసి వచ్చేలా ఎక్కువ మంది నంబర్లను ఎంచుకుంటున్నట్టు పలు టెలికాం కంపెనీల సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి నంబర్ల కోసం కొంతకాలం ఎదురుచూసేందుకు కూడా వెనుకాడటం లేదని హైదరాబాద్ నాగోల్‌లోని ఓ సెల్‌ఫోన్ దుకాణ యజమాని పేర్కొన్నారు.
కొత్త కారు తీసుకున్నా. ఫ్యాన్సీ నంబర్ తీసుకోవాలని అనుకున్నాం. కానీ, దానికి పోటీ ఎక్కువగా ఉన్నది. రూ.50 వేలు మొదలు.. ఎవరైనా పోటీ పడితే ఇంకా ఎక్కువే ఖర్చు చేయాల్సి వస్తది. అందుకే నా కూతురు పుట్టిన రోజు తేదీ వచ్చేలా (జనవరి 13వ తేదీ) 0113 నంబర్ తీసుకున్నా. ఇందుకోసం రూ.5 వేలు పెట్టి బుక్ చేసుకున్నా. పోటీ లేకపోవడంతో సులువుగా నంబర్ దక్కింది.
– అశోక్‌రెడ్డి, తట్టిఅన్నారం, రంగారెడ్డి జిల్లా