కడ్తాల్, జూన్ 20 : తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లిలో గత కొన్ని రోజులుగా చెత్త సేకరణను గ్రామ పంచాయతీ సిబ్బంది నిలిపేశారు. ఈ విషయమై స్థానిక బీఆర్ఎస్ నాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా..గ్రామంలోని చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్లో డీజిల్ పోయించేందుకు డబ్బులు లేకపోవడంతో ట్రాక్టర్ తాళం చెవిని తలకొండపల్లి ఎంపీడీవోకు అప్పగించినట్లు చెప్పారని వారు తెలిపారు. దీంతో శుక్రవారం గ్రామంలోని కిరాణా షాపులు, గ్రామ పెద్దల వద్ద బీఆర్ఎస్ నాయకులు జోలే పట్టి భిక్షాటన చేసి.. వచ్చిన మొత్తం రూ. 11,350ను గ్రామ కారోబార్ నరేశ్‌కు అందించి.. గ్రామంలోని చెత్తాచెదారాన్ని సేకరించాలని సూచించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. గ్రామ పాలకులు లేకపోవడంతో గ్రామాలను పట్టించుకునే నాథుడే లేడని.. పారిశుధ్య పనులు జరగకపోవడంతో గ్రామాల్లోని కాలనీలు కంపుకొడుతున్నాయని… ఈగలు, దోమల బెడత ఎక్కువైందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామంలోనూ పారిశుధ్య పనులు ప్రతిరోజూ జరిగేవని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి దారుణంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ట్రాక్టర్లో డీజిల్ పోయించేందుకు కూడా డబ్బులు లేకపోవడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. అధికారులు స్పందించి గ్రామంలోని చెత్తాచెదారాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయమ్మావెంకటయ్య, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు జంగయ్య, నాయకులు శరత్చంద్ర, కృష్ణయ్య, అశోక్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, రాజు, విజేందర్, నర్సింహ, జీవ, కొండల్, ఆంజనేయులు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.