బొంరాస్‌పేట, డిసెంబర్ 5 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నది. సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారు. వ్యవసాయశాఖ సేవలను రైతులకు చేరువ చేసేందుకు ఐదు వేల హెక్టార్లకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది.
ఏఈవోలు క్లస్టర్ కేంద్రంలో అందుబాటులో రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం గురించి చర్చించుకోవడానికి ఒక్కో క్లస్టర్లో రూ.22 లక్షలు వ్యయం చేసి రైతు వేదికలను నిర్మించింది. క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి గ్రామ, మండల, జిల్లా స్థాయి రైతు బంధు సంఘాలను ఏర్పాటు చేసి రైతులను బాధ్యులుగా చేసింది. వీరంతా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా పని చేస్తున్నారు. వ్యవసాయ సంబంధిత సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రైతు వేదికలను వినియోగించుకోవాలి.
ప్రతి ఏఈవో రోజూ ఉదయం, సాయంత్రం గంటసేపు రైతు వేదికలో రైతులకు అందుబాటులో ఉండాలని, అనంతరం క్షేత్ర సందర్శనకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతు వేదికల నిర్వహణకు ఇంతవరకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోవడంతో వీటి నిర్వహణ కొంత కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వం ఆలోచించి రైతు వేదికలరె సద్వినియోగం చేసుకునేలా వాటి నిర్వహణకు నెలకు రూ.9 వేలు ప్రభుత్వం అందజేస్తుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఇటీవలే ప్రకటించారు. మంత్రి ప్రకటన మేరకు ప్రభుత్వం రైతు వేదికల నిర్వహణకు ఐదు నెలలకు నిధులు విడుదల చేసింది.
జిల్లాకు 44.55 లక్షలు విడుదల
ప్రభుత్వ హామీ మేరకు నెలకు రూ.9 వేల చొప్పున ఐదు నెలలకుగాను రూ.45 వేలను జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి జమ చేసింది. ఈ నిధులను క్లస్టర్‌వారీగా విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రైతు వేదికల పేరిట బ్యాంకులో పొదుపు ఖాతాలను ప్రారంభించి.. వాటిలో జమ చేయడానికి అధికారులు ఏఈవోలకు సమాచారం ఇచ్చారు. నిధుల విడుదలతో రైతు వేదికల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని భావిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 99 క్లస్టర్లు, 99 రైతు వేదికలు ఉండగా.. ఒక్కో దానికి రూ.45 వేల చొప్పున ఐదు నెలలకుగాను రూ.44.55 లక్షల నిధులు విడుదలయ్యాయి.
నిధుల వినియోగం ఇలా..
రైతు వేదికల నిర్వహణకు మంజూరయ్యే నిధులను ఏ విధంగా వాడుకోవాలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక రైతు వేదికకు నెలకు మంజూరయ్యే రూ.9వేలలో విద్యుత్ బిల్లులకు రూ.వెయ్యి, తాగునీటికి రూ.500, స్వీపర్‌కు రూ.3వేలు, స్టేషనరీ, జిరాక్స్ తదితరాలకు రూ.వెయ్యి, రెండు శిక్షణలకు రూ.2500, చిన్న చిన్న రిపేర్లు, శానిటరీ, ఫర్నిచర్, వ్యవసాయ సంబంధ పత్రికల కొనుగోలు తదితర ఖర్చులకు రూ.వెయ్యి వినియోగించుకోవాలి.
నిధులను రైతు వేదిక ఖాతాల్లో జమ చేస్తాం
– గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
ఇంతవరకు రైతు వేదికి నిర్వహణ ఇబ్బందిగా ఉండేది. నిధులు రావడంతో స్వీపర్‌ను నియమించుకోవడం, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు చెల్లించుకోవచ్చు. ఏఈవోలు క్షేత్ర సందర్శనకు వెళితే రైతు వేదికను మూయకుండా స్వీపర్ తెరిచి ఉంచుతారు. వచ్చిన నిధులను రైతు వేదిక ఖాతాల్లో జమ చేస్తాం.