పరిగి, ఏప్రిల్ 6 : చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 80వేల పైచిలుకు ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు విడుదల చేయనుండడంతో ఉద్యోగార్థులు ఉద్యోగాలు సాధించేందుకు సర్కారు వివిధ శాఖల ద్వారా ఉచిత కోచింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నది. గతంలో ఎప్పుడైనా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు భలే గిరాకీ ఉండేది. వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌కు వెళ్లే స్థోమత లేనివారు తమకు అందుబాటులో ఉన్న పుస్తకాలు, గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న పుస్తకాలు చదివి ఉద్యోగాలు సాధించారు. ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించాలంటే మరింత కష్టపడి చదువాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఉద్యోగానికి పోటీ పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. ఉద్యోగార్థుల వయో పరిమితిని కూడా ప్రభుత్వం పెంచడం ద్వారా ఉద్యోగార్థుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల ద్వారా ఉచిత శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
వికారాబాద్ జిల్లా పరిధిలో ఒక ఎస్సీ స్టడీ సెంటర్, ఒక ఎస్టీ స్టడీ సెంటర్ల ఏర్పాటుకు సర్కారు నిర్ణయించింది. ఎస్టీ స్టడీ సెంటర్‌ను పరిగిలోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్సీ స్టడీ సెంటర్‌ను వికారాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు స్థలం ఎంపిక చేయనున్నారు. ఈ స్టడీ సెంటర్లలో ఒక్కోదానిలో 100 మంది చొప్పున ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకుగాను ఆయా శాఖలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో ఆయా శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉచిత శిక్షణకు ఎంపిక చేయనున్నారు. ఈ నెలాఖరు లోపు దరఖాస్తులను స్వీకరించి మే 1 నుంచి శిక్షణా తరగతుల నిర్వహణకు నిర్ణయించారు.
వికారాబాద్ జిల్లాలో నాలుగు బీసీ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వికారాబాద్‌లో శాశ్వత ప్రాతిపదికన స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే వివిధ ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం కానుండడంతో వెనువెంటనే వికారాబాద్ జిల్లావ్యాప్తంగా నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్‌లలో ఈ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. తాండూరులోని డిగ్రీ కళాశాలలో బీసీ స్టడీ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించారు. అక్కడ కంప్యూటర్లు సైతం అందుబాటులో ఉండడంతో డిజిటల్ తరగతుల నిర్వహణకు, ఆన్లైన్లో పరీక్షల నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వికారాబాద్‌లో జిల్లా గ్రంథాలయం నూతన భవనంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని యోచిస్తున్నారు. పరిగి, కొడంగల్‌లలో సైతం ఎక్కడ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది రెండు మూడు రోజుల్లో నిర్ణయిస్తారు. ఇందుకుగాను బీసీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ అలోక్ జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో ఇటీవలే పర్యటించారు. ఈ నాలుగు సెంటర్లలో ఒక్కోదానిలో 100 మందికి ఉచితంగా శిక్షణ, మెటీరియల్ అందజేస్తారు. మొదట పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా శిక్షణ పొందే వారిని ఎంపిక చేయనున్నారు.
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణతోపాటు ైస్టెఫండ్ ఇచ్చేందుకు నిర్ణయించింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారు ఈ నెల 16 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 16న ఆన్లైన్లో ఎంపిక పరీక్ష నిర్వహించి ఈ నెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,25,000 మందికి ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. గ్రూప్-1, గ్రూప్-2 రాసే 10వేల మంది అభ్యర్థులకు ైస్టెఫండ్ ఇస్తామన్నారు. గ్రూప్-1 అభ్యర్థులకు 6 నెలలపాటు నెలకు రూ.5వేలు, గ్రూప్-2 అభ్యర్థులకు మూడు నెలలపాటు నెలకు రూ.2వేలు, ఎస్ఐ అభ్యర్థులకు నెలకు రూ.2వేలు ైస్టెఫండ్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో పేదవారికి ఉచిత శిక్షణతోపాటు ఆర్థికంగా తోడ్పాటు అందించడం గొప్ప నిర్ణయంగా చెప్పవచ్చు.
వివిధ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగార్థులకు పోలీసు శాఖ ద్వారా మెళకువలు నేర్పించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించడంతో ఆయా కోచింగ్ సెంటర్లతో సమన్వయం చేసుకుంటూ అప్పుడప్పుడు పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అంశాలపై తరగతుల నిర్వహణకు సంబంధించి సైతం ఉత్తమ ఫ్యాకల్టీ, చక్కటి మెటీరియల్‌ను ఎంపిక చేసి తెప్పించేందుకు సహకారం అందించనున్నారు. అలాగే శారీరక దారుఢ్యానికి సంబంధించి, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ తదితర అంశాల్లో పోలీసు శాఖ ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నారు. జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖల ద్వారా ఏర్పాటు చేస్తున్న స్టడీ సెంటర్లలో పోలీసు ఉద్యోగాల శిక్షణకు హాజరయ్యే వారికి పోలీసులు మెళకువలు తెలియజేయనున్నారు. ఓవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ద్వారా ఉద్యోగార్థులు ఉద్యోగాల సాధన కోసం సర్కారు తోడ్పాటు అందిస్తున్నది.
ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్న సందర్భంగా నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఏండ్ల కాలంగా నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. పేద విద్యార్థులు ఆర్థిక స్థోమత లేక కోచింగ్ తీసుకోలేక నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ తరుణంలో ఎస్టీ స్టడీ సెంటర్‌ను ప్రభుత్వం పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉంది. దీంతో ఉద్యోగాన్ని సాధిస్తామనే ధైర్యం ఏర్పడుతున్నది.
చాలామంది ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చేస్తున్నారు. పేద విద్యార్థులకు అందుబాటులో ఎస్సీ స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేయడం హర్షించదగ్గ విషయం. అనుకూల ప్రదేశంలో ఉత్తమ కోచింగ్‌ను అందుకునే అదృష్టాన్ని ప్రభుత్వం కల్పించడంపై ప్రత్యేకంగా ధన్యవాదాలు.
బీసీ స్టడీ సెంటర్లో ఉచితంగా శిక్షణ అందించడం నిరుద్యోగులకు ఓ వరం లాంటిది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ వంటి పట్టణాలకు వెళ్లి చదువుకునే స్థోమత లేక నిరుత్సాహానికి గురవుతున్న పేద విద్యార్థులకు మంచి అవకాశం. సమీప ప్రాంతంలోని కోచింగ్ ఏర్పాటు చేసి పోటీ పరీక్షలపై అవగాహన, పట్టు కల్పించడం ఆనందదాయకం.
గ్రూప్-1, గ్రూప్-2, ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇస్తూ ైస్టెఫండ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎంతో సంతోషం. ఇలాంటి నిర్ణయాలు మరే రాష్ట్రంలోనూ అమలులో లేవు. వెనుకబడిన తరగతులకు చెందిన పేద నిరుద్యోగ అభ్యర్థులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుంది. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి గ్రూప్స్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నా. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటా.
ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే బీసీ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతో పాటు ైస్టెఫండ్ ఇవ్వాలని నిర్ణయించడం నిరుద్యోగులకు మంచి అవకాశం. గ్రామాల్లో ఉండే పేద విద్యార్థులకు పట్టణాలకు వెళ్లి శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేక పోటీ పరీక్షల్లో వెనుకబడుతున్నారు. వారిని ప్రోత్సహించడానికి తీసుకున్న ఈ నిర్ణయం బీసీ అభ్యర్థులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది.