షాద్‌నగర్‌రూరల్,జూన్24 : ఫరూఖ్‌నగర్ మండలంలోని నాగులపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామానికి చెందిన దాతలు మంగళవారం ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి మనోహర్ పాల్గొని విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అన్ని మౌలిక వసతులు ఉంటాయన్నారు.
విద్యార్థులు తమ భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు ,బ్యాగులను ఉచితంగ అందజేసిన గ్రామస్తులను ప్రత్యేకంగా అభినందించారు.