తాండూరు, అక్టోబర్ 11 : బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా ఉన్న తెలంగాణ.. కాంగ్రెస్ పరిపాలనలో ఎలా మారిందో ప్రజలందరూ ఆలోచించాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్‌రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం నాశనమవుతున్నదన్నారు. ప్రజలతో పాటు ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రైతులకు నిత్యం పండుగలా ఉండేదన్నారు. కాంగ్రెస్ పాలనలో పండుగలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అన్యాయం, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని పేర్కొన్నారు. తాండూరులో బ్రదర్స్ పాలనతో అభివృద్ధి శూన్యంగా మారిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో తీసుకొచ్చిన అభివృద్ధి పనులను ముందుకు సాగించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తాండూరు నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా, ఎర్రమట్టి వ్యాపారం కొనసాగుతున్నదన్నారు. అధికారులను భయాందోళనకు గురి చేస్తూ కొందరు నేతలు అక్రమ వ్యాపారాలు చేయడం విడ్డూరమని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ నాయకులకు త్వరలో బుద్ధి చెబుతామన్నారు.
ప్రజలు కాంగ్రెస్ పాలనలో తాండూరు నేతలను గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతామంటూ ఫోన్ చేస్తున్నారని తెలిపారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే మహేందర్‌రెడ్డికి విలువలు లేవన్నారు. బీఆర్ఎస్లో రెండు మార్లు మంత్రి పదవి అనుభవించి కేసీఆర్‌ను మోసం చేసి కాంగ్రెస్‌లో మళ్లీ పదవుల కోసం వెళ్లిన మహేందర్‌రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా మహేందర్‌రెడ్డి దగ్గరకు పోవడం లేదన్నారు. తాండూరులో తిరగకుండా ఇంట్లోనే కూర్చోవాలని హెచ్చరించారు. ఇప్పటికైనా తాండూరు ప్రజలు నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను గమనించి కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలని కోరారు. తాండూరు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులను, తెచ్చిన నిధులను గుర్తు చేశారు. ప్రాణం ఉన్నంత వరకు తాండూరు ప్రజల కోసం సేవకుడిగా పని చేస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను మనోహర్‌రెడ్డి కించపరిచేలా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ బ్రదర్స్‌లా.. తాండూరులో మనోహర్‌రెడ్డి కుటుంబ పాలన జరుగుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు పొందిన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంతో పాటు ఉన్న వాటిని సరిగా అమలు చేయకపోవడంతో పేదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు నయీం, నర్సిరెడ్డి, రవిందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సలీం, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.