పరిగి/వికారాబాద్, సెప్టెంబర్ 22 : నేవీ రాడార్ కేంద్రం వద్దే..వద్దు అని.. దానితో పర్యావరణం నాశనం అవుతుందని.. దామగుండాన్ని రక్షించుకునే బాధ్యత మనం దరిపై ఉన్నదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సేవ్ దామగుండం పేరిట హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌తో కలిసి ఆయన పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ..పూడూరు ప్రాంతంలో నేవీ రాడార్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే అడవి నాశనమవుతుందని, పర్యావరణం దెబ్బతింటుందనే ఒకే ఒక్క కారణంతో మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేవీ రాడార్ సెంటర్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం ద్వారా పూడూరు ప్రాంతంలోని అటవీ సంపద, వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కేంద్రం ఏర్పాటైతే 12 లక్షల ఔషధ మొక్కలకు ప్రమాదం ఉందని, పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో నష్టం తప్ప లాభం లేదని ఆయ న స్పష్టం చేశారు. అనంతరం వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే వికారాబాద్ అడవుల్లో సహజ వనరులను కోల్పో తామని, వన్యప్రాణుల మనుగడకు ముప్పు కలుగుతుందన్నారు.
ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన మన తొలి సీఎం కేసీఆర్ 3,000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు పదేండ్ల పాటు నిరాకరించినట్లు గుర్తు చేశారు. ఈ ధర్నాలో పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సునంద, బుగ్గన్న, రవికుమార్, మహేందర్, గీత, బీఆర్ఎస్ శ్రేణులు, పర్యావరణ ప్రేమికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.