కొత్తూరు, ఆగస్టు 11 : పచ్చని పంట పొలాలను తొలగించి ప్రజలకు రోగాలు అంటగడతారా అని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు వద్దే..వద్దని తేల్చి చెప్పారు. జీవో 641ని రద్దు చేయాలని కోరుతూ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు రాంబాల్‌నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. దీనికి అంజయ్యయాదవ్ హాజరై మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధాపూర్లో భూములను సేకరించిందని..
అయితే, అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పొలాల్లో డంపింగ్ యార్డుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు. వెంటనే డంపింగ్ యార్డు ఏర్పాటుకు జారీ చేసిన జీవో 641ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఐరన్ పరిశ్రమలతో కాలుష్య కారకంగా మారిన కొత్తూరు మండలంలో మరో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి మనుషుల ప్రాణాలు తీయొద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చే వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
జీవో 641 రద్దు చేయకపోతే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని డంపింగ్‌యార్డు వ్యతిరేక పోరాట సమితి జేఏసీ అధ్యక్షుడు రాంబాల్‌నాయక్ హెచ్చరించారు. జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతున్నదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ అన్నారు. ధర్నా అనంతరం జేఏసీ నాయకులు తహసీల్దార్ ముంతాజ్‌బేగానికి వినతిపత్రం అందజేశారు.
నిరసనలో నాయకులు భూపాల్, నర్సింహారెడ్డి, రాఘవాచారి, శ్రీనివాస్, భిక్షపతి, గంగిరెడ్డి, అబ్దుల్ రబ్జామీ, ప్రభాకర్, కృష్ణ, రవీందర్, శ్రీనివాసులు, రాజేందర్‌గౌడ్, తిరుమలయ్య, నిత్యానాయక్, శ్రీనివాస్‌రెడ్డి, బాలయ్య, రజిత, రవీంద్రనాయక్, అర్జునప్ప, ఈశ్వర్‌నాయక్, శ్రీకాంత్, ప్రకాశ్‌నాయక్, రవీందర్‌యాదవ్, దేవేందర్‌యాదవ్, గణేశ్, యాదయ్య, గోపాల్‌నాయక్, శ్రీనివాస్‌గౌడ్, నర్సింహాగౌడ్, సోమ్లానాయక్, యాదగిరి, సత్తయ్య, గోపాల్‌నాయక్ పాల్గొన్నారు.