షాద్‌నగర్, సెప్టెంబర్ 4 : ఘోష్ కమిషన్ రిపోర్టును పక్కన పెట్టడంతో పాటు కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించకుండా తప్పించుకున్న ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ షాద్‌నగర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపితే స్థానిక ఎమ్మెల్యే శంకర్ తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మండిపడ్డారు. గురువారం షాద్‌నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొందరు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు వేయడంతో పాటు ఆరోపణలు చేస్తున్నారని.. చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. పదేండ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసినా ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని.. కేవలం రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పదే పదే తన ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని, ఆయన సర్పంచ్ కాకముందు ఎన్ని ఆస్తులు ఉండే..? నేడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని ఆస్తులు ఉన్నాయో..? నేను ఎమ్మెల్యే కాక ముందు, అయ్యాక నా ఆస్తులు ఎన్నో..? విచారణ చేయిద్దామని సవాల్ చేశారు.
నియోజకవర్గంలో ఎవరి దగ్గర నుంచైనా లంచం తీసుకుంటే నిరూపించాలన్నారు. నా పెద్ద కుమారుడు నేను ఎమ్మెల్యే కాక ముందే వ్యాపారం చేసి అప్పటికే హైదరాబాద్‌లో ఇళ్లు కొన్నాడని, చిన్న కుమారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారన్నారు. నేను అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు మీ వద్ద ఆధారాలుంటే కోర్టుకు వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పులు చేసేవారే సుద్దపూసల్లా.. సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడొద్దని హితవు పలికారు.
ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడొద్దని బీఆర్ఎస్ పార్టీ నందిగామ మండలాధ్యక్షులు పద్మారెడ్డి సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నారాయణరెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్, మండలాల అధ్యక్షులు లక్ష్మణ్‌నాయక్, మురళీధర్‌రెడ్డి, హఫీజ్, కృష్ణ, శ్రీధర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు నటరాజన్, నాయకులు రాజారమేశ్వర్రెడ్డి, గోవింద్, అశోక్, రెడ్డి నర్సింహ, ప్రేమ్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.