వికారాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : పరిగి మండలం రాపోల్, కాళ్లపూర్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన ఇండస్ట్రియల్ పార్కుకు వ్యతిరేకంగా అన్నదాతలు నెలరోజులుగా ఉద్యమిస్తున్నారు. భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నాలతోపాటు రాపోల్, కాళ్లపూర్ గ్రామాల్లో రైతులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటికే అన్నదాతలను కలిసి మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మద్దతు తెలిపారు.

మంగళవారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రైతులకు మద్దతు తెలిపేందుకు వస్తున్న దృష్ట్యా జిల్లాలో బీఆర్ఎస్ నాయకులే, కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ నిర్బంధించారు. రాపోల్, కాళ్లాపూర్ అన్నదాతలకు మద్దతు తెలిపేందుకు వస్తున్న హరీశ్‌రావును తెల్లవారుజామునే గృహ నిర్బంధం చేయగా.. మధ్యాహ్నం పరిగికి బయలుదేరగా అప్పా జంక్షన్ వద్ద హరీశ్‌రావుతోపాటు సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ జల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్‌ను గృహ నిర్బంధం చేసిన పోలీసులు, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొదట బొంరాస్‌పేట, ధారూరు తదనంతరం బంట్వారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు, రాపోల్, కాళ్లపూర్ రైతులను అరెస్ట్ చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. మరోవైపు తెల్లవారుజామునే రాపోల్, కాళ్లపూర్ రైతులను పోలీసులు అరెస్ట్ చేసి పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో రాపోల్, కాళ్లపూర్ గ్రామాల అన్నదాతలు పిల్లలతోపాటు ఇంటిల్లిపాది పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ఫోనులో రైతులతో మాట్లాడారు. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రజా, రైతు సంక్షేమంలో ప్రభుత్వం విఫలం

కొడంగల్ : ప్రజా, రైతు సంక్షేమంలో సర్కారు పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ముందస్తు అరెస్టులు చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కాళ్లాపూర్ గ్రామంలో రైతులకు మద్దతుగా మాజీ మంత్రి హరీశ్‌రావు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లగచెర్ల తరహాలో కాళ్లాపూర్ రైతుల నుంచి అక్రమంగా 1200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నదని.. ఇందుకు రైతులకు మద్దతు తెలిపేందుకు మాజీ మంత్రి వస్తున్న క్రమంలో అరెస్టుల పర్వం చేపడుతున్నట్లు తెలిపారు.
రైతు భరోసా అందుకోలేక, రుణమాఫీ కాక, ఎరువులు సకాలంలో అందకుండా రైతులు నానా గోస పడుతున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి సంక్షేమాన్ని అందించకుండా ఉన్న భూమిని లాక్కొని రైతును నిరాధారం చేస్తున్నట్లు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎవరినీ అక్రమంగా అరెస్టులు చేస్తలేమని అంటూనే ఈ విధమైన అరెస్టులకు పాల్పడమేంటని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అమలు చేసే సత్తా లేక ప్రశ్నించే వారిని అరెస్టులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్టులకు భయపడేది లేదని, ప్రజా పక్షాన పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ముందుంటుందని స్పష్టం చేశారు. పరిగికి బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లకుండా ముందస్తుగా ఎక్కడి వారికి అక్కడ పోసులు ముందస్తు అరెస్టులు చేశారు.
భూములు గుంజుకోవడమేనా ఇందిరమ్మ పాలనా?
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

బంట్వారం : ఇండస్ట్రియల్ పార్కుల పేరిట రైతుల వ్యవసాయ భూముల చుట్టూ రేవంత్ ప్రభుత్వం తిరుగుతున్నదని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం ఆయనను ముందస్తు అరెస్టు చేసి, బంట్వారం పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి, సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే అనేక చోట్ల ఇండస్ట్రియల్ పార్కులు, హైడ్రా, ఫ్యూచర్ సిటీ పేర అనేక భూములు గుంజుకునేందుకు ఈ సర్కారు పని చేస్తున్నదన్నారు. పార్కుల పేర లక్షలాది ఎకరాలను సేకరించినా ఎక్కడా పనులు ప్రారంభించకపోవడం సిగ్గుచేటన్నారు. నేడు కొడంగల్ వెళ్లేందుకు రేడియల్ రోడ్డు పేర పరిగి నియోజకవర్గంలోని 12 గ్రామాల్లో 500 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇందులో 400 ఎకరాలు పట్టా భూములుండగా, 99 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉందన్నారు.
ముఖ్యమంత్రి తన అనుచర గణానికి భూములు కట్టబెట్టేందుకే ఈ భూ సేకరణ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే రాకంచర్ల, నంచర్ల, ఎన్కేపల్లిలో భూసేకరణ చేసి ఏండ్లు గడుస్తున్నా ఒక్క పనీ చేపట్టలేదన్నారు. భూసేకరణకు నిరసనగా రైతులు చేపడుతున్న దీక్షలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు అయిందని, ఏ ఒక్క పని చేయకుండా, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా, పక్కదోవ పట్టించి, ప్రశ్నించే గొంతుకలను నొక్కివేయాలని, బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నదన్నారు. నిరసనకు దిగిన రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లే తమ నాయకులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, తనను ఇలా అరెస్టు చేశారన్నారు. ఇలాంటి అరెస్టులు తగదన్నారు. ఇప్పటికైనా భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రైతులపరంగా ఎంతటి పోరాటానికైనా దిగుతామని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డిది నిరంకుశ పాలన
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ రేవంత్‌రెడ్డి నిరంకుశ పాలనను చేస్తున్నారన్నారు. రేవంత్ ఆలోచలన్నీ భూములపైనే ఉందని, ఖమ్మం నుంచి వికారాబాద్ వరకు భూముల కబ్జాలు చేస్తున్నారన్నారు. తప్పు చేయకపోతే ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. భూములు కోల్పోతున్నందుకు రైతుల గోడును సర్కారు పట్టించుకోవడం లేదు కాబట్టి తాము మద్దతుగా నిలుస్తున్నామన్నారు. పోలీసుల తీరు కూడా రక్షకులు కాదు భక్షకులుగా తయారయ్యారన్నారు. పోలీసులను పెట్టుకొని ఎన్ని రోజులు రాజ్యమేలుతారని, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ గుర్తు చేయొద్దు, మర్చిపోవాలనే ఉద్దేశంతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా వంద శాతం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రైతులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పెన్షనర్లను అరెస్ట్ చేశారన్నారు.