బడంగ్‌పేట, డిసెంబర్ 9 : సీఎంత్ రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు కట్టపై ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి ఆమె క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ తల్లి విగ్రహానికి కూడా ముసుగు వేయాల్సి వస్తుందన్నారు. ఆడబిడ్డలను అవమానించేలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ అని పేర్కొన్నారు. తెలుగు తల్లి రూపాన్ని ఎందుకు మార్చారో ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. కేసీఆర్ నమూనాలను చెరిపివేయడానికి రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకున్న రోజు ఆడపడుచులైన ఆశావర్కర్లపై దాడి చేశారన్నారు. తెలంగాణ చరిత్రను తుడిచిపెట్టాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ అనవాళ్లు లేకుండా ఎవరూ ఏమీ చేయలేరన్నారు. తెలంగాణకు దార్శనికుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ విక్రంరెడ్డి, మాజీ ఎంపీపీ లావణ్య, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కామేశ్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సునీత, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.