రంగారెడ్డి, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల గడ్డపై మూడోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు. సోమవారం శ్రీనగర్ కాలనీలోని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి నివాసంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తున్నదని, ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని ముక్తకంఠంతో పేర్కొన్నారు.
పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ప్రస్తుత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్నారని, ఆ ఇద్దరినీ ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నదని, కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుని మళ్లీ బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
త్వరలోనే పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని, పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మాజీ మంత్రి సబితారెడ్డి కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ సురభివాణిదేవి, ఎగ్గె మల్లేశం, దయానంద్ గుప్తా, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, యువ నేత కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.