కొండాపూర్: పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి( Navatareddy ) అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ( Green India Challenge ) లో భాగంగా చందానగర్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప భక్తులతో కలిసి శనివారం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలన్నారు. పెరుగుతున్న కాలుషాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాలన్నారు.
ప్రభుత్వంతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, ప్రసాద్, శ్రీకాంత్, మల్లారెడ్డి , సంగారెడ్డి, నగేష్ రెడ్డి, రాజు, సునీత, అనంత రెడ్డి, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.