షాద్‌నగర్‌రూరల్, సెప్టెంబర్ 14 : మారుమూల గ్రామాలు, తండాలు, పట్టణాల్లో గల్లీకొక్క వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి వచ్చిందటే చాలు ప్రధానంగా యువత ఆనందంతో పోటాపోటీగా నవరాత్రి ఉత్సవాలను జరిపేందుకు ఉత్సాహం కనబరుస్తారు. ఒక్కరికి మించి మరొకరు పోటీని తలపించేలా వినాయక నవరాత్రులను నిర్వహిస్తుంటారు. కానీ 42 ఏండ్లుగా ఒకే మండపంలో ఒక్కటే వినాయకుడిని గ్రామంలో ఏర్పాటు చేసి కలిసికట్టుగా వినాయక నవర్రాతులను నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆగ్రామమే ఫరూఖ్‌నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ తమ ఐక్యతను చాటుతున్నారు. ప్రతి కుంటుబం చందాలు వేసి వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధ్దలతో ఐకమత్యంగా నిర్వహిస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.
గతంలో కమిటీ అధ్యక్షుడిగా మైనార్టీ
వినాయకుడి సేవా సమితి, భజన మండలి పేరుతో కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. గతంలో వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా గ్రామానికి చెందిన మైనార్టీ నాయకుడు గఫూర్ని ఎన్నుకున్నారు. ఇలా కులమతాలకు అతీతంగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తుండటం అభినందనీయం.
భజన మండలికి ప్రత్యేక గుర్తింపు
మండలంలోనే లింగారెడ్డిగూడ భజన మం డలికి ప్రత్యేక గుర్తింపు కలదు. నవరాత్రుల సందర్భంగా అ నునిత్యం భజన చేస్తూ గ్రామంలో మరింత ఆధ్యాత్మికతను నెలకొల్పుతారు. ఆధ్యాత్మిక భజన మండలికి పెట్టింది పేరుగా లింగారెడ్డిగూడ భజన మండలి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.
మిగులు నగదు ఆలయ అభివృద్ధ్దికి
ప్రతి సంవత్సరం వినాయకుడి ఉత్సవాల కోసం గ్రామంలో చేసిన చందాలలో ఖర్చులు పోను మిగిలిని నగదును దేవాలయ అభివృద్ధికి వినియోగిస్తారు. ఏది ఏమైనా ఒకే మండపంలో కలిసికట్టుగా గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తుండటంతో నియోజక వర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐకమత్య గ్రామంగా లింగారెడ్డిగూడ
ఏ పండుగనైన మా గ్రామంలో కలిసికట్టుగా చేసుకుంటాం. నవరాత్రులను 42 సంవత్సరాలుగా ఒకే మండపంలో ఐకమత్యంగా ఒకే వినాయడుకి ప్రత్యేక పూజల చేయడం మా గ్రామ ప్రత్యేకత. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.
-భీష్వ మాధవి, సర్పంచ్,లింగారెడ్డిగూడ గ్రామం
చాలా సంతోషంగా..
గ్రామస్తులందరం ఐకమత్యంగా వినాయక ఉత్సవాలను ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడా లేని విధంగా మా గ్రామంలో గ్రామస్తులందరూ కలిసికట్టుగా పండుగలు జరుపుకోవడం అభినందనీయం.
-బీష్వ రామకృష్ణ, ఎంపీటీసీ,లింగారెడ్డిగూడ గ్రామం.