పెద్దఅంబర్‌పేట, మే 10: అవుట్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొని ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెంచాడు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్దఅంబర్‌పేట సమీపంలోని గండిచెర్వు బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బహుదూర్‌పుర హెచ్‌బీ కాలనీకి చెందిన దీపేశ్ అగర్వాల్ (23) తన స్నేహితులు వీటీసీ విజయ్‌నగర్ కాలనీకి చెందిన సంచయ్ మల్పాని(22), మూసాపేట్‌కు చెందిన ప్రియాన్షు మిట్టల్ (23)తో కలిసి కారులో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత శంషాబాద్ వైపు నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తున్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గండిచెర్వు బ్రిడ్జి సమీపంలోకి రాగానే.. ఓఆర్ఆర్పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా నోపార్కింగ్ ప్రాంతంలో నిలిపిన బొలేరో గూడ్సు వాహనాన్ని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టింది. కారు ముందున్న బొలేరో వాహనంలో ఇరుక్కుపోయింది. రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. కాలిపోతున్న బొలేరో వాహనాన్ని డ్రైవరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. మంటలు మరింత చెలరేగాయి. తోటి వాహనదారులు సహాయక చర్యలు చేపట్టేలోగానే దీపేశ్ అగర్వాల్, సంచయ్ మల్పాని సజీవ దహనం అయ్యారు.
తీవ్రంగా కాలిన గాయాలైన ప్రియాన్షు మిట్టల్‌ను అతికష్టంగా బయటకు తీశారు. అంబులెన్సులో నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ తెల్లవారుజామునే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నోపార్కింగ్ ప్రాంతంలో బొలేరో వాహనం నిలుపడం వల్లే ప్రమాదం జరిగిందని దీపేశ్ అగర్వాల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. స్నేహితులను కలిసి వస్తానని వెళ్లిన కొడుకు మృత్యువాత పడటంపై దీపేశ్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పెద్దఅంబర్‌పేట సమీపంలోని గండి చెర్వు బ్రిడ్జి వద్ద ఓఆర్ఆర్పై ఓ లారీని గూడ్సు బొలేరో వాహనం కొద్దిగా ఢీకొట్టింది. దీంతో బొలేరో వాహనం డివైడర్ మధ్యలో ఆగిపోయింది. డివైడర్ మధ్య ఆగిన బొలేరో వాహనాన్ని పక్కకు తప్పించేందుకు పలువురు ప్రయత్నించారు. సహాయక చర్యలను చూసిన మరో బొలేరో వాహనం డ్రైవర్ తన బండిని పక్కన ఆపాడు. సహాయక చర్యల్లో పాలుపంచుకున్నాడు. ఇదే సమయంలో యువకులు దీపేశ్ అగర్వాల్, సంచయ్ మల్పాని, ప్రియాన్షు మిట్టల్ కారులో అతివేగంగా అటుగా వెళ్తున్నట్టు సమాచారం.
దగ్గరకు వచ్చాక అకస్మాత్తుగా డివైడర్ మధ్యలో ఉన్న వాహనాన్ని గుర్తించి, ఒక్కసారిగా పక్క లేన్లలోకి వెళ్లినట్టు తెలుస్తున్నది. పక్కన ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని అతివేగంగా వెనుక నుంచి ఢీకొట్టినట్టు తోటి వాహనదారులు చెబుతున్నారు. ఒకరికి సాయం చేద్దామని డ్రైవర్ ప్రయత్నిస్తే.. అదే ముగ్గురి పాలిట మృత్యుశాపంగా మారినట్టు తెలుస్తున్నది. యువకులు ముగ్గురు వ్యాపారం చేస్తుంటారు.