రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్ప టి నుంచి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా ప్రభుత్వం ఇంకా రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయకపోవడం.. బ్యాంకులు అన్నదాతలకు రుణాలు మంజూరు చేయకపోవడంతో మళ్లీ వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పుల కోసం ఎప్పుడూ చూడని అన్నదాతలు.. ప్రస్తుత ప్రభుత్వంలో పంటల సాగుకు మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కేసీఆర్ ప్రభుత్వంలో సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎరువులను కొనేందుకు రైతుబంధు సాయాన్ని అందజేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్ సీజన్ దాటుతున్నా సాయం అందక అష్టకష్టాలు పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పినా ఇప్పటివరకూ ప్రారంభించలేదు. గతేడాది యాసంగిలో రైతుబంధు సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో నాలుగు ఎకరాలు గల రైతులకు మాత్రమే పంపిణీ చేసింది. జిల్లాలో 2,95,796 మంది అర్హులైన రైతులుండగా 2,00,567 రైతులకే సాయం అందింది. మరో 95,000 మందికి పంపిణీ చేయలేదు.
కాగా అధికారంలోకి రాగానే రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ప్రగల్భాలు పలికిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. గద్దెనెక్కిన తర్వా త ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేలా.. రైతును రాజుగా చేసే సదుద్దేశంతో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టింది.
ఈ పథకం అమల్లోకి రావడంతో వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల వద్ద పంట రుణాలు తీసుకునే రైతుల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతల కష్టా లు మళ్లీ మొదటికొచ్చాయి. ఓ వైపు పెట్టుబడి సాయం అందక.. బ్యాంకర్లు పంట రుణాలను మంజూరు చేయకపోవడంతో అన్నదాతలు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నది.
భరోసాపై ప్రస్తావనే లేదు..
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకంతో అన్నదాతలను అప్పుల బారి నుంచి ఆదుకున్నది. ప్రతి ఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించడంతో పంట రుణాల కోసం బ్యాంకులు, ఇతర ప్రైవే ట్ వ్యక్తుల వద్దకు రైతులు వెళ్లలేదు. ఈ పథకం కింద బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2,622 కోట్ల సాయాన్ని జిల్లాలోని అన్నదాతలకు పెట్టుబడి నిమిత్తం అందజేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పెట్టుబడి సాయానికి బ్రేక్ పడడంతో రైతులు మళ్లీ అప్పుల బారిన పడుతున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయా న్ని అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. గత యాసంగిలో కొంతమందికే రైతుబంధు సాయాన్ని జమ చేసిన ప్రభుత్వం వానకాలం ముగుస్తున్నా ఇప్పటివరకు సాయం అందించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో అన్నదాతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
రైతులకు అరకొర రుణాలే..
ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు బ్యాంకర్లు అరకొర రుణాలనే మం జూరు చేశారు. ఓ వైపు రైతులకు పంట రుణాలను మంజూరు చేయ డంలో నిర్లక్ష్యం చేస్తుండడంతోపాటు ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యం (రూ.1800 కోట్ల)లో 44 శాతం రుణాలనే మంజూరు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రూ. 3,434 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు రూ.800 కోట్ల రుణాలను మాత్రమే బ్యాంకర్లు రైతులకు ఇచ్చారు.
అర్హుల్లో కొంతమందికే ప్రభుత్వం రుణమాఫీని వర్తింపజేయగా.. మాఫీ అయిన రైతుల పంట రుణాలను రెన్యువల్ చేయడంలోనూ బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రుణమాఫీ అయిన రైతుల రుణాలను రెన్యువల్ చేస్తేనే కొత్త రుణాల మంజూరుకు అవకాశం ఉంటుంది. దీంతో రుణమాఫీ అయిన రైతు లు గత నెల రోజులుగా రుణాల రెన్యువల్ కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తు న్నారు.
ఉద యం 8 నుంచి సాయంత్రం 5 గంటల వర కు బ్యాంకుల వద్ద పడిగాపులు గాస్తున్నారు. కొం తమంది అన్నదాతలు ప్రతిఏటా తమ పంట రుణాలను రెన్యువల్ చేసుకున్నా కొన్ని బ్యాంకులు వాటిని అప్డేట్ చేయకపోవడంతో సంబంధిత రైతులకు రుణమాఫీ కాకపోవడంతోపాటు రెన్యువల్ సమస్యా వేధిస్తున్నది. ఖరీఫ్ సీజన్ దాటిపోతున్నా రైతులకు పంట రుణాలను మంజూరు చేయడంలో బ్యాంకర్లు తీవ్ర జాప్యం చేస్తుండడం గమనార్హం.
రైతన్నకు కష్టాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రైతన్నలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల హామీలను తుంగలో తొక్కింది. ప్రతి ఏటా ఎకరానికి రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. దీంతో పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎరువులు, విత్తనాలను కొనేందుకు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పెట్టుబడి సాయాన్ని వెంటనే పంపిణీ చేయాలి.
-కమలాపురం శివప్ప, రైతు, పెద్దేముల్ గ్రామం, పెద్దేముల్
పంటల సాగుకు ఇబ్బంది పడుతున్నాం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఇంకా రైతు భరోసా పంపిణే కాలేదు. దీంతో పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇంతకు ఈ ప్రభుత్వం రైతుభరోసా కింద పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేస్తుందో..లేదో..? స్పష్టంగా చెప్పడంలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా లేదు. పంటల సాగుకు ముందే అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయ్యేది.
-ముడావత్ లక్ష్మణ్, రైతు, ఎర్రగడ్డతండా, పెద్దేముల్