వికారాబాద్, అక్టోబర్ 7 : రైతులు ఇబ్బందిపడకుండా ఐకేపీ కేంద్రాల ద్వారా వానకాలం పంట వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) లింగ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం వికారాబాద్ జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో లింగ్యానాయక్ తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి వచ్చే ధాన్యాన్ని ఐకేపీ 21, పీఏసీఎస్ 62, డీసీఎంఎస్ 22, ఎఫ్‌పీఓ 2, మొత్తం 107 కేంద్రాల ద్వారా 100 శాతం కొనుగోలు చేయాలన్నారు. ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. తగిన ప్రణాళికతో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరగాలని తెలిపారు. జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగైనందున, లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదన్నారు.
ప్రభుత్వం గ్రేడ్-ఏ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2320, సాధారణ రకం రూ.2300, సన్న రకానికి అదనంగా రూ.500 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, కాంటాలు, టార్పాలిన్లు, గన్నీ సంచులను వెంటనే కొనుగోలు కేంద్రాలకు పంపాలని సూచించారు. వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చేలా ప్రణాళిక చేసుకోవాలన్నారు. రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, సివిల్ సప్లై అధికారి మోహన్‌బాబు, డీఎం విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి, మార్కెటింగ్ అధికారి సారంగపాణి ఉన్నారు.
న్యాయం చేయాలి
అభివృద్ధి పనుల్లో భాగంగా మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. భూమి అందించిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో అవకతవకలు జరిగాయని సోమవారం పట్టణానికి విచ్చేసిన కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను కడా కార్యాలయంలో కలిసి భూ బాధితులు తమ గోడును విన్నవించుకున్నారు. భూమికి తగినంతగా ప్రభుత్వం అందిస్తామన్న నష్టపరిహారం అరకొరగా అందిందని, నష్టపరిహారం చెల్లించడలో ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. నష్టపరిహారాన్ని చెక్కుల రూపంలో అందించారని, కానీ ఉన్న భూమికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం చెల్లింపులు జరగలేదని వాపోయారు. ఎక్కువ భూమిని తీసుకొని తక్కువగా చెల్లింపులు చేశారని, అర్హులకు కాకుండా అనర్హులకు కూడా ఇందులో వాటా ఇచ్చారని ఆరోపించారు. అభివృద్ధికి సహకరించాలనే ఉద్దేశంతో బంగారం పండే భూములను వదులుకున్నామని, ఓ విధంగా కన్న తల్లికి దూరం అయినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాన్ని సీఎం గుర్తించాలని కోరారు. ఉన్న భూమి మేరకు ఆ ప్రకారమే చెల్లింపులు చేపట్టాలని కోరారు. రైతుల ఆవేదనకు కలెక్టర్ స్పందించి త్వరలోనే సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టి భూ బాధితులకు సరైన న్యాయం చేయాలని తఁసీల్దార్కు కలెక్టర్ అదేశాలు జారీ చేశారు.