కేశంపేట, సెప్టెంబర్ 23 : మండలంలోని కొత్తపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద రైతులు మంగళవారం యూరియాకోసం బారులు తీరారు. పీఏసీఎస్‌కు 550 బస్తాలు రాగా రైతులు అంతకు రెట్టించిన స్థాయిలో తరలివచ్చారు. దీంతో అక్కడి సిబ్బంది పోలీస్ పహారాలో రైతులకు ఎరువును అందించారు. మూడు రోజుల కిందట టోకెన్లు పొందిన 80 మందికిపైగా రైతులకు యూరియా అందలేదని సిబ్బంది వివరించారు.
కొందుర్గు, సెప్టెంబర్ 23 : మండలంలోని శ్రీరంగాపూర్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు మంగళవారం ఉదయం నుంచే యూరియా కోసం నిరీక్షించారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 900 బస్తాల యూరియా రాగా, అక్కడి అధికారులు పోలీస్ పహారాలో ఒక్కో రైతుకు రెండు బస్తాల పంపిణీ చేశారు. అందని రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 1700 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మరో 200 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చే అవకాశముందని ఏవో సురేశ్‌రెడ్డి తెలిపారు.