జిల్లాలోని పరిగి మండలం రాపోల్, కాళ్లపూర్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా అన్నదాతలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పార్కు మాకొద్దు, మా కుటుంబాలను రోడ్డున పడేయవద్దంటూ రైతులు గత 50 రోజులకుపైగా పలు విధాలుగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని లగచర్లలో అన్నదాతలు ఎంత మొరపెట్టుకున్నా వినకుండా జైల్లో పెట్టి మరీ భూములు గుంజుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిగి మండలంలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నది. తాము భూములివ్వబోమని దాదాపు రెండు నెలలుగా కలెక్టర్ మొదలుకొని స్థానిక తహసీల్దార్ వరకు పదులసార్లు వినతిపత్రాలు అందజేసినా సర్కారు నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. దాదాపు రెండు నెలలుగా కలెక్టరేట్ ముట్టడి, ధర్నాలు, వినతిపత్రాలు అందజేసిన రాపోల్, కాళ్లాపూర్ రైతులు గత పదిహేను రోజులుగా రెండు గ్రామాల్లో బాధిత రైతులు నిరాహార దీక్షలు చేపడుతున్నారు. రెండు గ్రామాల అన్నదాతలు ఇంటిల్లిపాది దీక్షలో పాల్గొంటూ పార్కుకు భూములు ఇచ్చేది లేదని, ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములివ్వబోమని ప్రభుత్వానికి తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే భూసేకరణకుగాను సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌ను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
– వికారాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)
గ్రామపంచాయతీకిగాని, రైతులకుగాని ఎలాంటి ముందస్తు సమాచారమివ్వకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడమేంటని అన్నదాతలు నిలదీస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్కుకు జారీ చేసిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను నిలిపివేయాలని రాపోల్, కాళ్లపూర్ గ్రామపంచాయతీల పాలకవర్గాలు ఏకపక్షంగా తీర్మానాలు చేసినప్పటికీ సర్కారు విస్మరిస్తుండటం శోచనీయం. భూములను ప్రభుత్వం గుంజుకుంటే రాపోల్, కాళ్లపూర్ గ్రామ పరిధిలోని 300-400 కుటుంబాలు రోడ్డున పడుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అన్నదాతలు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే కాళ్లాపూర్ గ్రామపంచాయతీ పరధిలోని 428 ఎకరాల అసైన్డ్ భూముల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన సర్కారు.. మరో వారం, పది రోజుల్లో రాపోల్ గ్రామపంచాయతీ పరిధిలోని 509 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
1197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు నిర్ణయం
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలోని 1197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన సర్కారు.. అన్నదాతల నుంచి వ్యతిరేకత రాకుండా విడతలవారీగా భూసేకరణ చేసేలా ముందుకెళ్తున్నది. ప్రస్తుతం కాళ్లాపూర్లోని 428 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లో భాగంగా రెవెన్యూ అధికారులకు భూముల సర్వేకు కూడా సర్కారు అనుమతులివ్వడంతోపాటు భూసేకరణకు సంబంధించి అభ్యంతరాలుంటే 60 రోజుల్లోపు(ఈ నెల 13లోపు) కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజనల్ అధికారికి సమర్పించాలని సూచించింది. 1197 ఎకరాల్లో కాళ్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో అసైన్డ్ భూములు-428.05 ఎకరాలు, పట్టా భూములకు సంబంధించి 159.25 ఎకరాలు, రాపోల్ గ్రామానికి సంబంధించి అసైన్డ్ భూములు 509 ఎకరాలుకాగా, 101.08 ఎకరాల పట్టా భూములను ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం భూసేకరణ చేసేందుకు నిర్ణయించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని లగచర్ల అన్నదాతలు ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములిచ్చేది లేదని దాదాపు ఏడాదిపాటు ఉద్యమించినా, పోలీసులతో బెదిరింపులకు పాల్పడి కేసులు నమోదు చేసి రైతులను జైలుకు పంపించి భూములను లాక్కున్న రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వం జిల్లాలోని పరిగి మండల అన్నదాతల భూములను ఇండస్ట్రియల్ పార్కు పేరిట బలవంతంగా భూములను గుంజుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా సంబంధిత రెండు గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూములతోపాటు పట్టా భూములను కూడా సేకరించేందుకు నిర్ణయించారు.
రైతులకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రాపోల్, కాళ్లాపూర్ అన్నదాతలకు మద్దతుగా అధికార పార్టీ మినహా అన్ని పార్టీలు ముందుకొచ్చాయి. భూ సేకరణ నోటిఫికేషన్ జారీ అయిన జనవరి 13 నుంచి రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. పరిగి మాజీ ఎమ్మెల్యేతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా రెండు గ్రామాల అన్నదాతలకు అండగా నిలిచారు. వారం రోజుల క్రితం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పరిగి మండలానికి చేరుకొని రైతుల నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలపడంతోపాటు అన్నదాతలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని రైతులకు ధైర్యాన్నిచ్చారు.
మరోవైపు రాపోల్, కాళ్లపూర్ అన్నదాతల పోరాటానికి బీజెపీ, వామపక్ష పార్టీలు కూడా మద్దతినిస్తున్నాయి. రెండు రోజుల క్రితం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ రాపోల్, కాళ్లపూర్ అన్నదాతలకు మద్దతు తెలిపేందుకు మంగళవారం పరిగి వచ్చేందుకు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నేడు బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు రాపోల్, కాళ్లపూర్ రైతులకు మద్దతు తెలిపేందుకు రానున్నట్లు తెలిసింది.