మండలంలోని బేగరికంచెలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం అక్రమంగా భూములను లాక్కుంటున్నదని శుక్రవారం పొలాల్లో బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు
– కందుకూరు
కందుకూరు, నవంబర్ 28: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచెలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా, అక్రమంగా భూమిని తీసుకుంటున్నారని రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. నష్టపరిహరం చెల్లింకుడా దౌర్జన్యంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి భూములు తీసకుంటే ఈకాంగ్రెస్ ప్రభుత్వం సమాచారం లేకుండా భూములు లాక్కుంటే చావడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుండగా విషయం తెలుసుకున్న సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాంచందర్, మండల కార్యదర్శి బుట్టి బాల్‌రాజ్‌లు మాట్లాడుతూ బేగరికంచె రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
10 సంవత్సరాల క్రితం 10, 20సర్వే నంబర్లలో కేసీఆర్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతుల నుంచి భూమిని తీసుకొని సర్వే నిర్వహించి కంచె ఏర్పాటు చేసిందని, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పేరుతో 120 సర్వే నంబర్లో భూములు ఉన్నాయని, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు రైతులు పండించిన పంటలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా, రైతులు తిరుగుబాటు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమంగా భూములు తీసుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. రోడ్డు వేయడానికి వచ్చిన యంత్రాలను అడ్డుకున్నారని.. గతంలో నష్టపరిహరం చెల్లించిన సర్వే నంబరులో ఈ భూములు కూడా ఉన్నాయని, కంచె వేసిన భూములను తీసుకోకుండా, ఇతర భూములను తీసుకోవడంపై రైతులు ముకుమ్మడిగా రెవెన్యూ అధికారులకు ఎదురు తిరిగారని వారు అన్నారు.
డీసీపీ, ఏసీపీలు తహసీల్దార్‌తో మాట్లాడి రైతులకు నష్టపరిహారం ఇచ్చే వరకు భూములను తీసుబోమని, రోడ్డును అమెజాన్ డాటా సెంటర్ నుండి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అదే విధంగా 145 సర్వే నంబర్లో 330 ఫీట్ల రోడ్డుకు భూములు కోల్పోతున్న రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని తెలిపారు.
నష్టపరిహారం చెల్లించకపోవడమే కాక సమాచారం ఇవ్వకుండా భూములను తీసుకోవాలని చూస్తే చావనైనా చస్తాం కాని భూములను ఇవ్వబోమని బేగరికంచె మహిళా రైతులు తెలిపారు. ప్రభుత్వం అక్రమంగా తీసుకోవాలని చూస్తున్నదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారుపై వారు దుమ్మెత్తి పోశారు. తమకు నష్టపరిహారంతోపాటు ప్లాట్లు కూడా ఇవ్వలేదని చంద్రకళ అనే మహిళా రైతు వాపోయారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో పంటలను నాశనం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. చావనైనా చస్తాం కానీ నష్టపరిహారం చెల్లించకుండా భూములు ఇవ్వమని తెగేసి చెప్పారు.