వికారాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) ; పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్న పల్లె.. ఫార్మా కంపెనీ ఏర్పాటుతో కళావిహీనంగా మారనున్నది. వ్యవసాయమే జీవనాధారంగా లగచర్ల గ్రామస్తులు బతుకును వెళ్లదీస్తున్నారు. వరి, జొన్న, కంది, పత్తి, సజ్జ, ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. ఏటా రెండు పంటలు పండిస్తూ హాయిగా కాలం వెళ్లదీస్తున్న అన్నదాతలకు ఫార్మా భూతం వస్తుందనగానే గుబులు మొదలైంది. కాలుష్య కారక ఫార్మా కంపెనీలు వస్తాయన్న ప్రభుత్వ ప్రకటనతో నిద్రాహారాలు మాని మళ్లీ దుబాయ్, ముంబయ్ వలసలు పోయి బతుకాల్సి వస్తదేమోనని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఠంచన్‌గా పెట్టుబడి సాయం అందేదని, రైతుబీమా, పంట రుణమాఫీ పథకాలు అందడం వల్ల ఎవుసం పండుగలా సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా భూములు లాక్కుంటే ఎట్లా బతుకాలని లగచర్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకులు బాగు చేస్తడని రేవంత్ రెడ్డిని గెలిపిస్తే సొంత నియోజకవర్గంలోనే కాలుష్య కారక ఫార్మా కంపెనీలను తీసుకొస్తుండంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా విలేజ్ ఏర్పాటుకు మా భూములివ్వంటూ తెగేసి చెబుతున్నారు.
ఊరంతా వ్యవసాయమే జీవనాధారం..
లగచర్ల గ్రామ జనాభా దాదాపు 2 వేలకు పైగా ఉంటుంది. గ్రామస్తులంతా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. బోర్లు కింద, వర్షాధార పంటలను సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో 1900 ఎకరాలకుపైగా సాగు భూమి ఉన్నది. వరి, జొన్న, పత్తి, కంది, సజ్జలు, జొన్నలు, ఉద్యానవన పంటలు మామిడి, బత్తాయి తదితర పంటలు పండిస్తున్నారు. బంగారు పంటలు పండే భూములను లాక్కుంటే ఏ ఊరికెళ్లి ఏం పని చేయాలి… ఎలా బతుకాలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని రైతులు నిలదీస్తున్నారు. ఫార్మా విలేజ్‌కు భూములిచ్చే ప్రసక్తే లేదని, మమ్మల్ని చంపి భూములను తీసుకోవాలని తెగేసి చెబుతున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
ఆది నుంచి ఫార్మా ఏర్పాటుపై వ్యతిరేకతే..
కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి ప్రకటన చేసినకాడి నుంచి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో ఫార్మా విలేజ్ కోసం 1274.25 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించనున్నది. సరిపడా ప్రభుత్వ భూమి లేనికారణంగా పట్టా భూములనూ ప్రభుత్వం తీసుకోనున్నది. హకీంపేటలో 505.37 ఎకరాలు, పోలేపల్లిలో 130 ఎకరాలు, లగచర్లలో 643 ఎకరాలను ఫార్మా కోసం సేకరించనున్నది. ఇప్పటికే లగచెర్ల గ్రామ పరిధిలో 632.26 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల పట్టా భూములను సేకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
నీళ్లు తెస్తడనుకుంటే.. కన్నీళ్లు తెప్పిస్తుండు..
రేవంత్‌రెడ్డి సీఎం అయితే నియోజకవర్గానికి పుష్కలంగా సాగు నీరు వస్తదనుకుంటే కన్నీళ్లు తెప్పిస్తుండు. ఫార్మా కంపెనీలు వస్తాయన్న కాడినుంచి మింగలేక, కక్కలేక.. మా బాధను ఎవరికీ చెప్పుకోలేక రోజు ఏడుస్తూ బతుకుతున్నం. ఫార్మా కంపెనీల వల్ల ఊరినే ఖాళీ చేయాల్సి వస్తుంది. పచ్చని పంట పొలాలు కనుమరుగవుతాయి. తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి వస్తది. మా భూములను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తం.. ఎంతవరకైనా కొట్లాడుతం.
– మొగులప్ప, లగచర్ల, దుద్యాల మండలం
కాంగ్రెస్ సర్కార్ గోస పెడుతున్నది…
కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీల కోసం పొలాలను లాక్కోవాలని చూస్తూ రైతులను గోస పెడుతున్నది. రైతు పచ్చగా ఉంటేనే రాష్ట్రం, దేశం పచ్చగా ఉంటుంది. అన్నదాతలు కన్నెర్రజేస్తే ఎలా ఉంటుందో రాబోవు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డికి తెలుస్తది. వ్యవసాయం వదిలి ఎక్కడికి వలస వెళ్లి బతుకాలి. ఎన్ని రోజులకైనా సొంత ఊరికి చేరుకోవాల్సిందే. ఫార్మాతో ఊరే ఖాళీ అయ్యే పరిస్థితి దాపురిస్తున్నది. పచ్చటి పంట భూముల్లో ఫార్మా కంపెనీలు పెట్టడం బాధాకరం.
– వికాస్, లగచర్ల, దుద్యాల మండలం
దేశానికి మా అన్న రక్షణ.. మా పొలానికి రక్షణేది ?
మా అన్న ఆర్మీలో ఉండి దేశ రక్షణకు శ్రమిస్తున్నాడు. కల్లబొల్లిమాటలు నమ్మి కాంగ్రెస్‌ను గెలిపిస్తే మా భూములు లాగేసుకుంటున్నరు. మా భూములకు రక్షణేది దేవుడా అని నిత్యం దిగులు చెందుతున్నా. ఫార్మాతో భూమి పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతమంతా నాశనమవుతుంది. ఎవ్వరు వచ్చినా, ఏం చెప్పినా మా భూములు ఇవ్వమంటే ఇవ్వం.
– కావలి శ్రీనివాస్, లగచర్ల, దుద్యాల మండలం
పొలం పోతే కూలీలుగానే బతకాలి..
ఊహ తెలిసిన నాటి నుంచి వ్యవసాయమే తప్ప మరో పని తెల్వదు. అటువంటిది ఇప్పుడు భూమిని లాక్కుంటే ఏం చేసుకొని బతకాలి. పొలాల్లో యజమానులుగా ఉన్నోళ్లం, కూలీలుగా మారాల్సిందేనా…? రైతుల శాపం కాంగ్రెస్‌కు తగులుతది. రేవంత్‌రెడ్డిని సీఎం చేస్తే మా బతుకులు మారుతాయనుకున్నాం. కానీ రోడ్డున పడుతామని అనుకోలేదు. ఫార్మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే మా భూముల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.
– గుండమోని బసప్ప ముదిరాజ్, లగచర్ల, దుద్యాల మండలం
నిన్ను సీఎంను చేస్తే.. మాకు కష్టాలు తెస్తవా..
రేవంత్‌రెడ్డి… ఓట్లు వేసి నిన్ను సీఎంను చేస్తే.. మా భూములు లాక్కొని కష్టాలపాలుజేస్తావా..? కష్టపడి సంపాదించుకున్న భూమిని ఎలా వదులుకుంటాం. ఫార్మా కంపెనీలు వద్దే వద్దు. ఈ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రానేరావద్దు. ఇంతమంది రైతులను బాధ పెట్టి ఏం సాధిస్తవ్ రేవంత్‌రెడ్డి… మా కష్టాలు, బాధలు పట్టించుకోకుండా మా నోటికాడి కూడును లాక్కుంటవా.. ఇందుకేనా నిన్ను గెలిపించింది. ఫార్మా కోసం మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. ఎంతటి పోరాటానికైనా సిద్ధం.
– సంగు వెంకటయ్య, లగచర్ల, దుద్యాల మండలం
రెక్కల కష్టాన్ని దోచుకోవద్దు..
దుబాయ్‌కి వెళ్లి తిని, తినక రెక్కలుముక్కలు చేసుకుని డబ్బు సంపాదించి కొంత పొలం కొనుక్కున్నా. ఫార్మా విలేజ్ పేరుతో నా రెక్కల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కొంటున్నది. వయస్సు మీదపడింది.. మళ్లీ దుబాయ్‌కి వెళ్లలేను. తిరిగి పొలాన్ని కొనలేను. మా భూములు తీసుకోవాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. నాకు ఇద్దకు కొడుకులు. కష్టపడ్డ సంపదను కాంగ్రెస్ సర్కార్ గద్దలా తన్నుకెళ్తే నా పిల్లలకు ఏమివ్వాలి. ఫార్మాకు మా భూమి ఇచ్చే ప్రసక్తే లేదు.
– వెంకటయ్య, లగచర్ల, దుద్యాల మండలం
ఫార్మాతో పరేషాన్..
ఎవుసం చేసే బతుకుతం. మాకు వేరే పని తెల్వదు. పొద్దున లేచి పొలంలో పని చేసుకునే మాకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీ అంటూ పరేషాన్ల పడేసింది. నా భూమిని పిల్లలకు ఇచ్చి ప్రశాంతంగా గడుపుదామనుకున్న సమయంలో ఈ దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని లాక్కోవాలని చూస్తున్నది. భూమి పోతుందంటే తిండి కూడా తినాలనిపించడం లేదు. ఎవుసం చేసే పిల్లల పెండ్లిళ్లు చేసినా. మా పిల్లలు కూడా ఎవుసంపైనే ఆధారపడి జీవిస్తున్నరు. ఉన్న భూమి లాక్కుంటే ఏలా బతకాలో ప్రభుత్వమే చెప్పాలి.
– రాములు, లగచర్ల, దుద్యాల మండలం
పొలం పోతే బతికేదెలా..?
మాది ఉమ్మడి కుటుంబం. భూమిని నమ్ముకొని ట్రాక్టర్ తెచ్చుకొని వ్యవసాయం చేసుకొంటున్నాం. మా మొత్తం భూమి ఫార్మాలో పోతుంది. అందరూ చిన్న పిల్లలు. పొలం పోతే బతికేదెలా..? ఫార్మా కంపెనీలు అంటున్న నాటి నుంచి రోజూ ఏడుస్తూ జీవిస్తున్నం. ఈ ప్రాంతం చాలా స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. ఫార్మా వస్తే.. కాలుష్యమై రోగాల బారినపడుతం. భూమి తీసుకుంటే ఏ ఊరికెళ్లాలి.. ఏం చేసి బతుకాలో సీఎం చెప్పాలి.
– రాఘవేందర్, లగచర్ల, దుద్యాల మండలం