యాచారం, ఏప్రిల్ 27 : మండలంలోని మొండిగౌరెల్లిలో భూముల సర్వే జోరుగా సాగుతున్నది. గ్రామంలో ఉన్న 19, 68, 127 సర్వేనంబర్లలోని అసైన్డ్ భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు ముమ్మరంగా సర్వే చేస్తున్నారు. ఇప్పటికే 127 సర్వే నంబర్లో భూములను సర్వే చేయగా.. సోమవారం 19 సర్వేనంబర్‌లోని కంచ భూములను సర్వే చేసేందుకు అధికారులు, సర్వేయర్లు అక్కడికి వస్తుండగా గ్రామానికి చెందిన రైతులు, మాజీ సర్పంచ్ బండిమీది కృష్ణ ఆధ్వర్యంలో వారిని మధ్యలోనే అడ్డుకున్నారు.
కంచ భూములను కొన్నేండ్లుగా సాగు చేసుకుని జీవిస్తున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాగుకు యోగ్యంకాని భూములకు సాగుకు యోగ్యమైన భూములకు ఎకరాకు రూ.30లక్షల చొప్పున చెల్లించడం ఎంతవరకు సమంజసమన్నారు. మా పొలాల్లో బోరు బావు లు, బావులు, పశువుల షెడ్లు, మూగజీవాలు, చెట్లు ఉన్నాయని వాటికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెల్లించే పరిహారంతో మరో చోట భూమి కాదు కదా కనీసం ఒక ప్లాటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
ప్రభుత్వం పునరాలోచన చేసి పంటలను సాగు చేసుకుని జీవిస్తున్న రైతులకు పరిహారాన్ని పెంచి ఆదుకోవాలని మాజీ సర్పంచ్ కృష్ణ డిమాండ్ చేశా రు. రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు గ్రామంలో ఎలాంటి సర్వేలు చేపట్టొద్దని ఆయన అధికారులను కోరారు. ఇంతలో ఎస్సైలు సత్యనారాయణ, ప్రియాంక కల్పించుకొని సర్వేను ముందుకు సాగేలా చూడాలని కోరారు. గతంలో గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణలో రైతులందరూ ఆమోదించాకే సర్వే మొదలు పెట్టారని, మళ్లీ మధ్యలో అడ్డగింతలు ఏంటని ఎస్సైలు రైతులను ప్రశ్నించగా.. మా అసైన్డ్ భూములను ప్రభుత్వానికి ఇస్తాం, కానీ సాగు భూములకు పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. గుట్టలు, రాళ్లకు సమానంగా సాగు భూములకు పరిహారం ఇస్తే తమకు అన్యాయం జరుగుతుందన్నారు. పరిహరం పెంచకపోతే భూ సర్వేను సాగనివ్వమని హెచ్చరించారు.