రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. పదేండ్ల కిందటి కరువు ఛాయలు కండ్లముందు కదులుతున్నాయి. పెట్టుబడి సాయం అందక అప్పులు, కరెంటు కోతలు, సాగు నీటి కొరత, పుట్టని పంట రుణాలు, తగ్గిన పంట దిగుబడులు, ‘మద్దతు’లేని ధర, నెరవేరని రూ.500 బోనస్ హామీ, పెరిగిన విత్తన ధరలు వంటి సమస్యలన్నీ ఒక్కసారిగా రైతాంగంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో గాడిన పడ్డ ఎవుసం కాంగ్రెస్ మూడు నెలల పాలనలోనే గాడి తప్పుతున్నది. ఫలితంగా నేడు పొలాల్లో రైతుల కన్నీరే పారుతున్నది. దిక్కుతోచని స్థితిలో రంగారెడ్డి జిల్లాలోని రైతు కుటుంబాలు దయనీయ జీవితాన్ని గడుపుతున్నాయి.
– రంగారెడ్డి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ)
నీళ్లు లేక బోరుమంటున్న బోర్లు ..
వానకాలం పంటలు అచ్చొచ్చాయనే ఆనందంతో యాసంగిలో వరితోపాటు వివిధ రకాల పంటలను సాగు చేసిన రైతులు ఆగమయ్యారు. జిల్లాలో మెజార్టీ వ్యవసాయం బోరు బావుల కిందనే సాగవుతున్నది. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. బావులు వట్టిపోయాయి. బోర్లు బోరుమంటున్నాయి. నీటికోసం తహతహలాడుతున్న చి‘వరి’దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. సాగు నీటి కొరతతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. కొన్నిచోట్ల పొట్టకు వచ్చిన వరి పైరుకు ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని గాడిలో పెట్టి రైతుల కష్టాలు తీర్చింది. కానీ.. పదేండ్ల తర్వాత మళ్లీ మునుపటి రోజులు కండ్ల ముందు కదలాడుతున్నాయని రైతాంగం ఆవేదన చెందుతున్నది.

కన్నీళ్లు పెట్టిస్తున్న కరెంటు కోతలు..
వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతున్న రైతాంగాన్ని కరెంటు కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అనధికార కోతలతో జిల్లాలోని రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో కరెంటు కోతలు మరీ దారుణంగా ఉంటుండడం ఆందోళన కలిగిస్తున్నది. డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు అమలు చేస్తున్నారు. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎడ్ల బండ్లు, ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పొలాలకు అందిస్తున్నారు. లో ఓల్టేజీ సమస్య కారణంగా తరచుగా మోటర్లు కాలిపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటితో పాటు కరెంటు సమస్య తీవ్రతరంగా ఉండి రైతులు రోడ్డెక్కడం సర్వసాధారణంగా ఉండేది. కానీ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కరెంటు కష్టాలను తీర్చింది. ప్రస్తుతం పాత రోజులు రావడంతో మళ్లీ రైతులు కరెంటు కోసం రోడ్డెక్కే పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావం, కరెంటు కోతలతో పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో కొందరు రైతులు పశువులకు వదిలేస్తే.. మరికొన్ని చోట్ల ఎండిన వరి పైరుకు నిప్పు పెడుతున్నారు.
పంట రుణాలు గగనం..
రైతుల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో రైతులకు కొత్తగా రుణాలు పొందడం గగనంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 మధ్యకాలంలో తీసుకున్న 74,701 మంది రైతులకు సంబంధించి రూ.420కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఇంకా కొంతమంది రైతులకు సంబంధించిన రుణ బకాయిలు ఉండగా.. బ్యాంకులకు చెల్లించవద్దని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీకి సంబంధించి డిసెంబర్ 9వ తేదీన నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు అతీగతీ లేదు. దీంతో క్రాప్ లోన్స్ తీసుకున్న రైతులకు బ్యాంకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. లీగల్ నోటీసులను సైతం పంపుతున్నారు. దీంతో గత అప్పు అలాగే ఉండిపోగా.. రైతులకు కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది.
మద్దతు ధర అంతంతే..
యాసంగి సీజన్ ఆరంభం నుంచే అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. అష్టకష్టాలు పడి పండించుకున్న పంటలను అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రతికూల పరిస్థితుల్లో ఎలాగోలా కొంతమేర పంటలను రైతులు కాపాడుకున్నారు. ప్రస్తుతం అక్కడక్కడా వరి కోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఏప్రిల్ 1న కొనుగోలు కేంద్రాలను తెరువాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో 33 కేంద్రాలకు గాను 25 కేంద్రాలను ప్రారంభించారు. ఇంకా వీటిల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలు కాలేదు. ఇప్పటికే చాలామంది రైతులు దళారులను ఆశ్రయించి ధాన్యాని అమ్ముకున్నారు. ఈసారి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలపై గ్రామాల్లో సరైన ప్రచారాన్ని చేపట్టలేదు. దీనికితోడు కొందరు వ్యాపారులు గ్రామాల్లోనే పాగావేసి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ మద్దతు ధర అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
దిగుబడులపై దిగులు..
ఈ యాసంగిలో గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాది 1,23,240 ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. ప్రస్తుత యాసంగిలో గతంలో కంటే 20 వేల ఎకరాల్లో తక్కువగా పంటల సాగు నమోదైంది. అలాగే గత యాసంగిలో వరి సాగు 90,447 ఎకరాలు ఉంటే.. ప్రస్తుత యాసంగిలో 83,110 ఎకరాల్లో మాత్రమే సాగైంది. మక్క జొన్న గత సీజన్లో 13,530 ఎకరాలు ఉంటే.. ఈసారి 6,150 ఎకరాలకే పరిమితమైంది. సీజన్ ఆరంభం నుంచే పంటల సాగుకు రైతన్నలకు ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. కరెంటు, సాగునీటి కొరత కారణంగా దిగుబడుల విషయంలో రైతుల అంచనాలు తలకిందులయ్యాయి. మండుతున్న ఎండలతో 13 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడంతో 500 అడుగుల లోతులో బోర్లు వేసినా నీరు పడే పరిస్థితి లేదు. మొన్నటి వరకు పుట్ల కొద్దీ వడ్లు పండిన జిల్లాలో ఇప్పుడు పంట చేతికి రావడమే గగనంగా మారింది. కూరగాయల సాగు సైతం గణనీయంగా తగ్గడంతో మార్కెట్లో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కొన్నాళ్లక్రితం వరకు రూ.4వేలు ఉన్న క్వింటాల్ బియ్యం ధర రూ.6వేలకు పైగానే పలుకుతున్నది.
పెరిగిన విత్తన ధరలు…
జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పత్తి సాగవుతున్నది. యాసంగి సీజన్ ముగిసిన వెంటనే పత్తి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో విత్తనాల పెరుగుదల అన్నదాతకు పిడుగుపాటుగా మారింది. మార్కెట్లో బీటీ1, బీటీ2 విత్తనాలుండగా.. ఎక్కువ మంది రైతులు బీటీ2నే కొనుగోలు చేస్తున్నారు. ఒక ఎకరానికి రెండేసి ప్యాకెట్లు అవసరం. 2021లో బీటీ2 ప్యాకెట్ ధర రూ.730 ఉండగా.. తాజాగా ఈ ధర రూ.864కు చేరింది. పెరిగిన విత్తనాల ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రైతు భరోసా.. అసంపూర్ణం..
యాసంగి సీజన్ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి పూర్తిస్థాయిలో రైతుబంధు సాయాన్ని అందించలేదు. 2023-24 యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలోని 4,04,436 మంది రైతులకు రూ.378.92 కోట్ల సాయాన్ని ఇవ్వాల్సి ఉన్నది. పెట్టుబడి సాయం మూడున్నర నెలలుగా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటివరకు 4 ఎకరాలలోపు రైతులకే సాయం జమ చేసినట్లు తెలిసింది. ఇంకా మిగిలిన వారికి ఎప్పుడు జమ చేస్తారో! తెలియని పరిస్థితి ఉన్నది.
రూ.500 బోనస్.. బోగస్..
ఎండిపోగా.. పండిన కాస్తంత పంటకైనా బోనస్ ఇచ్చి ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆదిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఎన్నికల నాటి హామీయే అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల హామీలో కాంగ్రెస్ వరికి ప్రతి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ‘ఎవరూ ధాన్యాన్ని అమ్ముకోకండి.. మేము వచ్చాక రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తాం’ అని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బోనస్ హామీని అమల్లోకి తేకపోవడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.