నైరుతి రుతుపవనాల రాకతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్నగా ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్టుబడి సాయం అందించకుండా, రుణాలు మంజూరు చేయకుండా రైతులను అప్పులపాలు చేయడంతోపాటు సకాలంలో విత్తనాలు, ఎరువులను అందించడంలోనూ విఫలమైంది. రైతు భరోసా కింద రూ.16 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్.. సకాలంలో విత్తనాలు, ఎరువులను పంపిణీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
జిల్లాలో అవసరమైన విత్తనాలు, ఎరువులకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికను రూపొందించినప్పటికీ జిల్లాకు స్టాక్ మాత్రం ఇంకా రాకపోవడం గమనార్హం. జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి కూడా సరిపోను స్టాక్ లేకపోవడంతో రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం దౌల్తాబాద్‌లో జీలుగ విత్తనాల కోసం రైతులు అధిక సంఖ్యలో రావడంతో కొంత తోపులాట జరిగింది. వంద మందికిపైగా రైతులకు విత్తనాలు దొరకకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్టాక్ అయిపోయిందంటూ చేతులేత్తేశారు.
– వికారాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో రైతులు దుక్కులు దున్ని విత్తనాలను నాటేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎరువులు, విత్తనాలను జిల్లాలకు సరిపోను స్టాక్‌ను తరలించలేదు. విత్తనాలను నాటే ముందు కావాల్సిన డీఏపీ ఎరువులకు సంబంధించి కేవలం పది శాతం మాత్రమే స్టాక్ ఉండడం గమనార్హం. డీఏపీని రైతులు కొనుగోలు చేస్తే కేవలం రెండు, మూడు రోజుల్లోనే ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న స్టాక్ పూర్తవుతుంది. తదనంతరం డీఏపీ కోసం రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొనే ప్రమాదమున్నది. వానకాలం సీజన్‌కుగాను 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయాధికారులు అంచనా వేయగా, ఇప్పటివరకు అందుబాటులో కేవలం 2609 మెట్రిక్ టన్నుల డీఏపీ మాత్రమే అందుబాటులో ఉన్నది.
మిగతా స్టాక్ ఎప్పుడు వస్తుందనేది ఇప్పటివరకు సంబంధిత అధికారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. డీఏపీ కోసం రోజుల తరబడి క్యూ లైన్లలో బారులు తీరాల్సిన పరిస్థితులున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియాకు సంబంధించి జిల్లాకు 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరంకాగా, ఇప్పటివరకు 8263 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. పొటాషియం 8 వేల మెట్రిక్ టన్నులు అవసరంకాగా, ఇప్పటివరకు కేవలం 175 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నది.
జిల్లాలో వానకాలం సాగు 5.61 లక్షల ఎకరాల్లో అవుతుందని జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. అత్యధికంగా పత్తి 2.58 లక్షల ఎకరాల్లో, కందులు 1.13 లక్షలు, వరి 1.31 లక్షలు, మొక్కజొన్న 26,908., పెసలు 14,568., మినుములు 5716., జొన్నలు 2500 ఎకరాల్లో సాగవుతుందని పేర్కొన్నది. పత్తి విత్తనాలకు సంబంధించి 5.50 లక్షల ప్యాకెట్లు, వరి 32,769 క్వింటాళ్ల విత్తనాలు, జొన్న 206 క్వింటాళ్లు, మొక్కజొన్న 2153., సోయాబీన్ 613., మినుములు 457., పెసలు 1165., కందులు 4534 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు.