కొడంగల్, జూన్ 3: అధిక దిగుబడి వస్తుందని నమ్మించి నాసిరకం వరి విత్తనాలు అంటగట్టడంతో తీవ్రంగా నష్టపోయామని, నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైతులు సంబంధిత ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ధర్నా చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. యాసంగి పంటకు సంబంధించి కొడంగల్ పట్టణంలోని ఓం ట్రేడింగ్ కంపెనీ దుకాణదారుడు యాసంగిలో విజయదుర్గా కంపెనీకి చెందిన వరి విత్తనాల వల్ల ఎకరాకు 100 నుంచి 120 బస్తాల వరకు పంట దిగుబడి వస్తుందని, అదేవిధంగా ప్రత్యేకమైన ఫర్టిలైజర్ వాడితే మంచి లాభం ఉంటుందని రైతులను నమ్మించి విక్రయించాడు.
కాగా పంట కోత దశలో ఎకరాకు కనీసంగా 30 బస్త్తాల వరి ధాన్యం కూడా చేతికి అందలేదని రైతులు వాపోయారు. ఎకరాకు దాదాపుగా రూ.9వేలకు పైగా విలువైన మందులు వాడినట్లు రైతులు తెలిపారు. చేతికి అందివచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, దీంతో చాలా తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నామన్నారు. అటు నాసిరకం ధాన్యం, ఇటు ప్రస్తుతం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్రంగా నష్టపోయామన్నారు.
నష్టపోయిన ప్రతి రైతుకూ రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై దుకాణ దారుడిని ప్రశ్నించగా అవి కంపెనీకి చెందిన విత్తనాలని, వాటితో తమకు ఎటువంటి సంబంధం ఉండదని చెప్పారు. కంపెనీ వాళ్లను సంప్రదించి నష్టపరిహారం కోరనున్నట్లు తెలిపారు. దాదాపుగా గంటపాటు సాగిన ధర్నాతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు, వ్యవసాయాధికారులు అక్కడి చేరుకొని కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.