బొంరాస్పేట, మార్చి 3 : వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు వేగంగా పడిపో తున్నాయి. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. వ్యవసాయానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం, వరుసగా కొన్నేళ్ల నుంచి సమృద్ధిగా కురిసిన వర్షాల వల్ల వ్యవసాయ బోర్లలో సమృద్ధిగా నీళ్లుండేవి. దీంతో రైతులు గత కొన్ని సంవత్సరాలుగా బోర్ల కింద యాసంగిలో ఎక్కువ విస్తీర్ణంలో వరి పంటలను సాగు చేశారు.
గత ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ ఏడాది కూడా బోర్లలో నీళ్లున్నాయని నమ్మిన రైతులు ఎప్పటిలాగే బోర్ల కింద యాసంగిలో వరినాట్లు వేశారు. కానీ ఎండలు ముదురుతున్న కొద్దీ బోర్ల లో నీటిమట్టం తగ్గిపోతుంది. ఫలితంగా వరి పంటలకు నీరందక ఎండిపో తున్నాయి. బొంరాస్పేట మండలంలో ఈ ఏడాది యాసంగిలో చెరువులు, బోర్ల కింద 13 వేల ఎకరాలలో వరినాట్లు వేశారు. చెరువుల కింద వరి పంటలు ఆశాజనకంగా ఉన్నా బోర్ల కింద సాగు చేసిన పంటలు నీరందక ఎండి పోతుం డడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని బాపల్లితండాలో బోర్లలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో వరి పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు తగ్గుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నీటిమట్టం తగ్గి బోర్లలో సన్నటి ధారలాగా నీళ్లు వస్తున్నాయని, రోజంతా పారబెట్టినా పొలమంతా పారడం లేదని రైతులు వేదన చెం దుతున్నారు. నీరందక వరిపొలాలకు నెర్రెలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బోర్లలో నీటిమట్టం పడిపోతుందని, రాబోయే రోజుల్లో నీళ్లు ఇంకా తగ్గి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు తెలిపారు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు నీరందక ఎండిపోతే దిగుబడి తగ్గి నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాకు రెండు ఎకరాల పొలం, రెండు వ్యవసాయ బోర్లు ఉన్నాయి. యాసంగి లో రెండు ఎకరాలలో వరినాట్లు వేశాను. కొన్ని రోజులుగా రెండు బోర్ల లో నీటిమట్టం తగ్గిపోయింది. అర ఎక రం వరిపంట ఎండిపోయింది. తండా లో ఇంకా కొంతమంది రైతుల బోర్లలో కూడా నీటిమట్టం తగ్గి వరి పంటలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోతే నష్టం వస్తుంది. పెట్టుబడి అయినా వస్తుందో రాదోనని ఆందోళనగా ఉంది.
– తార్యానాయక్, బాపల్లితండా